యూజీడీ పనులు సకాలంలో పూర్తిచేయాలి
● నాణ్యతలో ఎక్కడా రాజీ పడవద్దు ● డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క
మధిర: మధిర నియోజకవర్గ కేంద్రంలో మురుగునీటి సమస్యకు శాశ్వతంగా చెక్‌పెట్టేలా చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణ పనులను నిర్ణీత సమయానికి పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ఆదేశించారు. మధిరలోని క్యాంపు కార్యాలయంలో వివిధ అభివృద్ధి పనులపై బుధవారం ఆయన అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ పనులను ఉద్యోగులు నిరంతరం పర్యవేక్షిస్తూ అవాంతరాలు ఎదురైతే వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేయాలని సూచించారు. వీటిని ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తే పనులు సాఫీగా సాగుతాయని తెలిపారు. పనులు వేగంగా జరిగేలా పర్యవేక్షించడం ఎంత ముఖ్యమో నాణ్యత కూడా అంతే ప్రధానమని స్పష్టం చేశారు. నాణ్యతలో రాజీ పకుండా థర్డ్ పార్టీ ఏజెన్సీతో తనిఖీ చేయించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణ క్రమంలో స్థానికులు తాగునీరు, వాహనాల రాకపోకల విషయంలో ఇబ్బంది పడకుండా పర్యవేక్షించాలని తెలిపారు. మున్సిపల్ అధికారులు, కాంట్రాక్టర్లు సమన్వయంతో ముందుకు వెళ్లాలని, ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కఠిన నిర్ణయాలు కూడా ఉంటాయని భట్టి హెచ్చరించారు. అనంతరం మధిర మున్సిపాలిటీ కార్యాలయానికి సంబంధించి నూతన భవన నమూనాలను భట్టి విక్రమార్క పరిశీలించారు.


