ఆయకట్టుకు ఢోకా లేకుండా..
ఈనెల 15నుంచి పంటలకు
సాగర్ జలాలు?
జిల్లాలో 31 టీఎంసీల
విడుదలకు ప్రణాళిక
త్వరలోనే వెల్లడి కానున్న షెడ్యూల్
ఖమ్మంఅర్బన్: రానున్న రబీ సీజన్‌లో సాగర్ ఆయకట్టు కింద పంటల సాగు సాఫీగా సాగేలా నీటి విడుదలకు జలవనరుల శాఖ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈనెల 15వ తేదీ నుంచి వారబందీ విధానంలో నీటి విడుదలకు నిర్ణయించిన అధికారులు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు సమర్పించారు. అక్కడి నుంచి ఆమోదం రాగానే షెడ్యూల్ విడుదల చేసే అవకాశముంది.
వానాకాలంలో 42టీఎంసీలు
గడిచిన వానాకాలం పంటల సీజన్‌లో సాగర్ ఆయకట్టు కింద 4.10లక్షల ఎకరాలకు సాగునీరు అందించారు. ఇందులో 1.40 లక్షల ఎకరాల్లో వరి, 2.69 లక్షల ఎకరాల్లో ఆరుతడి పంటలకు నీరు అందినట్లు అధికారిక నివేదికలు చెబుతున్నారు. ఇందుకోసం 42 టీఎంసీల నీటిని వినియోగించారు. అలాగే, సాగర్ కాల్వలపై ఉన్న ఎత్తిపోతల పథకం ద్వారా మరో 25వేల ఎకరాలకు నీరు అందించినట్టు చెబుతున్నారు. సీజన్‌లో అధిక వర్షాలు ఉండడంతో పంటలకు ఏ సమస్య రాకుండా నీరు విడుదల చేయగలిగారు.
రబీ సీజన్ కోసం..
రానున్న రబీ సీజన్‌లో జిల్లాలో 3.84లక్షల ఎకరాల్లో పంటలు సాగవనుండగా, వరి, ఆరుతడి పంటలకు 49.18 టీఎంసీల నీరు అవసరమని అధికారులు అంచనా వేశారు. ఇందులో అత్యధికంగా సాగర్ జలాల ద్వారా పంటలు సాగయ్యే అవకాశముంది. ఈమేరకు సాగర్ ప్రధాన కాల్వ ద్వారా 2.54లక్షల ఎకరాలకు నీరు పంపిణీ చేయాలని ప్రణాళిక రూపొందించారు. పంటల అవసరాలు, కాల్వలో పారే సమయాన ఆవిరి, లీకేజీలన్నీ లెక్కించి సుమారు 31.84 టీఎంసీల సాగర్ జలాల కేటాయింపునకు ప్రతిపాదించినట్లు తెలిసింది.
24 రోజులు నిరంతరం.. ఆతర్వాత వారబందీ
సాగర్ ఆయకట్టు మొత్తానికి 31.84 టీఎంసీల నీరు అవసరమని అంచనా వేశారు. ఈమేరకు ఖమ్మం, కల్లూరు సర్కిళ్లకు ఏడు రోజుల చొప్పున సరఫరా చేయాలనే భావనలో ఉన్నట్లు తెలిసింది. ఒక సర్కిల్‌లో ఏడు రోజులు, ఆతర్వాత ఏడు రోజులు ఇంకో సర్కిల్‌కు సరఫరా చేస్తూ వారబందీ విధానం అమలుచేయనున్నట్లు సమాచారం. తొలుత రైతులు ఇబ్బంది పడకుండా ఈనెల 15 నుంచి వరుసగా 24 రోజులు మాత్రం నిరంతరాయంగా నీరు సరఫరా చేసి, ఆతర్వాత వారబందీ విధానం అమలుచేసే అవకాశముంది. సాగర్ ప్రాజెక్టులో పుష్కలంగా నీరు ఉన్నందున రబీ పంటల సాగుకు నీటి విడుదలలో అవాంతరాలు ఎదురుకావని రైతులు భావిస్తున్నారు. ఈమేరకు అధికారులు జాగ్రత్తగా పర్యవేక్షిస్తే ఆయకట్టుకు నీరందనుంది. కాగా, ఇప్పటికే ఆయకట్టు పరిధిలోని రైతులు వరి నార్లు పోయడంతో పాటు మొక్కజొన్న తదితర ఆరు తడి పంటల సాగుకు సిద్ధమవుతున్నారు.


