నేటితో తెర..
ముగియనున్న ‘మొదటి దశ’ ప్రచారం
చివరి సమయాన హోరెత్తిస్తున్న అభ్యర్థులు
ఐదు గంటలకు బ్రేక్
ఖమ్మం సహకారనగర్: గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలని రెండేళ్లుగా వేయి కళ్లతో ఎదురుచూసిన ఆశావాహులు తమకు దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు శక్తియుక్తులన్నీ ధారపోస్తున్నారు. జిల్లాలో మూడు విడతలుగా ఎన్నికలు జరగనుండగా మొదటి దశలో ఏడు మండలాలు ఉన్నాయి. కొణిజర్ల, రఘునాథపాలెం, వైరా, బోనకల్, చింతకాని, మధిర, ఎర్రుపాలెం మండలాల్లో ఈనెల 3న ఉపసంహరణల అనంతరం బరిలో ఉన్న అభ్యర్థుల లెక్క తేలింది.
ప్రచార హోరు
తొలి విడతకు సంబంధించి ఏడు మండలాల్లోని 192 గ్రామపంచాయతీల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే, 20 మంచాయతీలు, 172 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 172 గ్రామపంచాయతీలు, 1,582వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఆయా గ్రామాల్లో ప్రచారం మోత మోగుతోంది. అభ్యర్థులు క్షణం తీరిక లేకుండా ప్రతీ ఇంటికి ఒకటికి రెండు సార్లు వెళ్లి తమను గెలిపించాలని కోరుతున్నారు. ఇంటింటి ప్రచారంతోపాటు పోస్టర్లు, స్టిక్కర్లు, మైక్‌ల ద్వారా ప్రచారం ఉధృతం చేశారు.
ప్రచారంలో అగ్ర నాయకులు
తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగే గ్రామాల్లో అభ్యర్థుల తరఫున అన్ని పార్టీల నేతలు ప్రచారం చేస్తున్నారు. బీఆర్‌ఎస్ అభ్యర్థుల తరఫున రఘునాథపాలెం మండలంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక సీపీఐ అభ్యర్థుల తరఫున ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు హాజరవుతున్నారు. అలాగే, కాంగ్రెస్ అభ్యర్థుల ప్రచారంలో మంత్రి తుమ్మల తనయుడు యుగంధర్ తదితరులు పాల్గొంటున్నారు.
మొదటి దశగా గ్రామాల్లో ఈనెల 11వ తేదీన పోలింగ్ జరగనుంది. ఆయా గ్రామాల్లో ప్రచారం మంగళవారం సాయంత్రం ఐదు గంటలతో ముగించాలి. దీంతో ఆదివారం నుంచి అభ్యర్థులు, వారి మద్దతుదారులు క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇక మంగళవారం సాయంత్రంతో గడువు ముగిశాక చేపట్టాల్సిన కార్యాచరణ కూడా రూపొందించుకున్నారు. క్షేత్రస్థాయిలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. పోలింగ్ ముందు ఇచ్చే హామీలు, చేసే ప్రచారం, ఓటర్లను మచ్చిక చేసుకునే అంశంపైనే గెలుపోటములు ఆధారపడి ఉండడంతో అభ్యర్థులు అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యారు.


