మస్త్‌గా బందోబస్తు
ఎన్నికలకు 2వేల మంది సిబ్బందితో పహారా
సమస్యాత్మక, సున్నిత కేంద్రాల్లో ప్రత్యేక నిఘా
ఇప్పటికే సమస్యలు సృష్టించే వారు, రౌడీషీటర్ల బైండోవర్
రెచ్చగొట్టే ప్రచారాలు వద్దు
సాక్షిప్రతినిఽధి, ఖమ్మం: ‘జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా, ప్రశాంతంగా జరిగేలా బందోబస్తు నిర్వహిస్తున్నాం. ఎక్కడా ఇబ్బంది ఎదురుకాకుండా చూడాలని ఎన్నికల
విధుల్లో పాల్గొనే సిబ్బందికి సూచనలు చేశాం. రెండు వేల మంది పోలీసు సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొననుండగా సమస్యాత్మక, సున్నితమైన పోలింగ్ కేంద్రాల్లో అదనంగా
బందోబస్తు ఉంటుంది. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రజలు, రాజకీయ పార్టీలు సహకరించాలి.’ అని పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ కోరారు.
గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా ‘సాక్షి’కి శుక్రవారం సీపీ ఇంటర్వ్యూలో
వెల్లడించిన వివరాలు ఆయన మాటల్లోనే..
ముందస్తుగా అవగాహన కల్పించి..
ఎన్నికల విధులకు సంబంధించి ఉన్నతస్థాయి మొదలు కిందిస్థాయి పోలీస్ సిబ్బంది వరకు అవగాహన కల్పించాం. విధులు, ఎన్నికల ప్రవర్తన నియమావళి, శాంతిభద్రతల పరిరక్షణ అంశాలపై వివరించాం. ఎన్నికలు ముగిసేంత వరకు అప్రమత్తంగా ఉంటూ సమర్థవంతంగా విధులు నిర్వహించాలని చెప్పాం. డబ్బు, మద్యం ప్రభావాన్ని నిలువరించేందుకు తనిఖీలు చేపడుతున్నాం. స్టాటిస్టికల్ సర్వైలెన్స్ టీమ్స్, ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్, రూట్ మొబైల్ పార్టీలు విధుల్లో నిమగ్నమయ్యాయి. ఘర్షణ వాతావరణం లేకుండా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడమే మా ముందున్న లక్ష్యం.
184 క్రిటికల్ పోలింగ్ ప్రాంతాలు
జిల్లాలో మూడు విడతలుగా ఎన్నికలు జరుగుతాయి. మొదటి విడతలో ఏడు, రెండో విడతలో ఆరు, మూడో విడతలో ఏడు మండలాలకు గాను 184 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల ప్రాంతాలను గుర్తించాం. విడతల వారీగా 57, 77, 50 కేంద్రాలు ఉండగా గత ఎన్నికల అనుభవాల దృష్ట్యా వీటిపై ప్రత్యేకంగా నిఘా ఏర్పాటుచేస్తాం. అలాగే, మూడు విడతల్లో కలిపి 70 సున్నితమైన పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. మొదటి విడతలో 17, రెండో విడతలో 35, మూడో విడతలో 18 ఉన్నట్లు గుర్తించి ఇప్పటినుంచే ప్రత్యేక దృష్టి సారించాం.
నిరంతరం నిఘా
ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో ఐదు ఎఫ్‌ఎస్‌టీ బృందాలు, 15 ఎస్‌ఎస్‌టీ బృందాల ద్వారా నిఘా కొనసాగుతోంది. డబ్బు, మద్యం ప్రభావాన్ని నియంత్రించేలా తనిఖీలు చేపడుతున్నాం. ఇప్పటివరకు 753 లీటర్ల మద్యం సీజ్‌చేసి బాధ్యులపై కేసులు నమోదు చేశాం. జిల్లాలోని బోనకల్, ఏన్కూరు, కల్లూరు, కామేపల్లి, ఖమ్మంరూరల్, కూసుమంచి, మధిర, ముదిగొండ, నేలకొండపల్లి, పెనుబల్లి, సత్తుపల్లి, కారేపల్లి, తిరుమలాయపాలెం, వైరా, ఎర్రుపాలెం మండలాల్లో ఏర్పాటైన చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
అవాంఛనీయ ఘటనలు జరగకుండా..
ఎన్నికల వేళ అవాంఛనీయ ఘటనలు జరగకుండా బైండోవర్లు చేస్తున్నాం. సమస్యలు సృష్టించే వారు, రౌడీషీటర్లు 4వేల మందిని గుర్తించి అల్లర్లకు కారణం కాబోమని సొంత పూచీకత్తు తీసుకున్నాం. క్రిటికల్ పోలింగ్ కేంద్రాల్లో నలుగురు నుంచి ఐదుగురు సిబ్బంది విధుల్లో ఉంటారు. అలాగే వేయి మంది ఓటర్లు ఉన్న కేంద్రాల్లో ఇద్దరు, అంతకు మించి ఉంటే ముగ్గురు చొప్పున సిబ్బంది విధులు నిర్వర్తిస్తారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలను పరిశీలించి క్యూ లైన్ల ఏర్పాటు, పార్కింగ్ వసతులపై సూచనలు ఇచ్చాం.
‘సాక్షి’తో పోలీసు కమిషనర్ సునీల్‌దత్
గ్రామాల వారీగా ఏర్పాటైన వాట్సాప్ గ్రూపుల్లో ఎస్‌హెచ్‌ఓలు కూడా ఉన్నారు. గ్రామస్తులెవరైనా రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు, అల్లర్లు సృష్టించే పోస్టులు పెడితే వారిపై సిబ్బంది చర్యలు తీసుకుంటారు. ఎన్నికల నేపథ్యాన 163 బీఎన్‌ఎస్‌ఎస్ యాక్ట్ అమలులో ఉంటుంది. మొదటి విడతకు సంబంధించి ఈనెల 9న సాయంత్రం 5గంటల నుంచి ఈనెల 11న ఫలితాలు ప్రకటించే వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. పోలింగ్ సందర్భంగా ఓటర్లకు భద్రతరీత్యా సమస్యలు ఎదురైనా 100కు సమాచారం ఇవ్వాలి. ప్రజలంతా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా సిబ్బందికి ప్రజలు, రాజకీయ పార్టీలు సహకరించాలి.
మస్త్‌గా బందోబస్తు


