బాబ్బాబూ.. తప్పక రండి !
● ఇతరచోట్ల ఉన్న ఓటర్లకు అభ్యర్థుల ఫోన్లు ● రవాణా, ఇతర ఖర్చులు భరిస్తామని హామీ
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి విడత పోలింగ్ ఈనెల 11న జరగనుంది. దీంతో అభ్యర్థులు ప్రచారం ద్వారా ఓటర్లను ఆకట్టుకునే యత్నాల్లో నిమగ్నమయ్యారు. గ్రామంలో ఓటరుగా నమోదై ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని రప్పించేలా హామీలు స్తున్నారు. ‘మీ ప్రయాణ ఖర్చులు భర్తిస్తాం.. తప్పక వచ్చి ఓటేయండి’ అంటూ ఫోన్లలో అభ్యర్థిస్తున్నారు. ఓటరు జాబితా ఆధారంగా గ్రామం బయట ఎందరు ఉన్నారో ఆరా తీస్తూ స్వయంగా అభ్యర్థులు ఫోన్ చేయడమే కాక తెలిసిన వారితోనూ ఫోన్ చేయిస్తున్నారు.
ప్రచారంపై దృష్టి
మొదటి విడత ఎన్నికల్లో ఉపసంహరణ గడువు ముగియగా అభ్యర్థులెవరెవరో తేలడంతో ప్రచారంపై దృష్టి సారించారు. గుర్తుల ఆధారంగా పోస్టర్లు, స్టిక్కర్లు ముద్రించి ఇంటింటా ఓటర్లను కలుస్తున్నారు. ఇళ్లకు వెళ్లి వారితో అనుబంధాన్ని గుర్తు చేస్తూ కుటుంబమంతా తనకే ఓటు వేయాలని కోరుతున్నారు.
ఓటరు లిస్ట్ ఆధారంగా..
జిల్లాలోని కొణిజర్ల, రఘునాథపాలెం, వైరా, బోనకల్, చింతకాని, మధిర, ఎర్రుపాలెం మండలాల్లోని 173 గ్రామపంచాయతీల్లో తొలివిడతగా ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అభ్యర్థులు ఓటర్ల జాబితా ఆధారంగా ఆయా కుటుంబాలను సంప్రదిస్తున్నారు. మహిళా ఓటర్లు కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యాన తమ తల్లి, సోదరి, సతీమణులను కూడా ప్రచారంలో వెంట తీసుకెళ్తున్నారు.
గ్రామంలో లేని వారు..
గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న అభ్యర్థులు ఒక్క ఓటు కూడా తప్పిపోవద్దనే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. గ్రామంలో ఓటరుగా నమోదై వృత్తి, వ్యాపారాల రీత్యా ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారిని గుర్తించి ఫోన్ చేస్తూ పోలింగ్ రోజు వచ్చి ఓటు వేయాలని కోరుతున్నారు. ఎంత దూరంలో ఉన్నప్పటికీ రావాలని, ప్రయాణ ఖర్చులు సహా ఇతరత్రా భరిస్తామని విజ్ఞప్తి చేస్తున్నారు.
పోల్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి..
గ్రామస్థాయిలో పట్టు నిరూపించుకునేందుకు ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో అభ్యర్థులు అన్ని రకాల వ్యూహాలు అమలుచేస్తున్నారు. పోలింగ్ రోజున ఓటర్లందరినీ కేంద్రాలకు రప్పించేలా అనుచరులు, పార్టీ నాయకులతో చర్చిస్తున్నారు. గ్రామంలో పెద్ద కుటుంబాలేవి.. ఆ కుటుంబంలో ఎందరు సభ్యులు, వారు ఎవరికి ఓటు వేసే అవకాశముందో ఆరా తీస్తున్నారు. తమకే అనుకూలమని భావిస్తే పలుమార్లు కలుస్తున్నారు.


