సూపర్‌ఫాస్ట్‌ రైళ్లకు హాల్టింగ్‌ కల్పించండి | - | Sakshi
Sakshi News home page

సూపర్‌ఫాస్ట్‌ రైళ్లకు హాల్టింగ్‌ కల్పించండి

Dec 6 2025 7:32 AM | Updated on Dec 6 2025 7:32 AM

సూపర్

సూపర్‌ఫాస్ట్‌ రైళ్లకు హాల్టింగ్‌ కల్పించండి

ఖమ్మంవైద్యవిభాగం: జిల్లా కేంద్రమే కాక వర్తక, వ్యాపార కేంద్రంగా ఉన్న ఖమ్మంలో పలు సూపర్‌ ఫాస్ట్‌ రైళ్లకు హాల్టింగ్‌ సదుపాయం కల్పించడంతో పాటు కోవిడ్‌ సమయాన రద్దు చేసిన ప్యాసింజర్‌ రైళ్లను పునరుద్ధరించాలని బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్‌ వద్దిరాజు రవిచంద్ర కోరారు. ఈమేరకు శుక్రవారం పార్లమెంట్‌ ఆవరణలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు వినతిపత్రం అందజేసి మాట్లాడారు. బిహార్‌, ఢిల్లీ, రాజస్థాన్‌ వైపు వెళ్లే ప్రయాణికులకు సౌలభ్యం కోసం గయా మా స్‌, స్వర్ణ జయంతి, జైపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ఖమ్మంలో నిలపాలని, శబరిమలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం కేరళ ఎక్స్‌ప్రెస్‌కు హాల్టింగ్‌ కల్పించాలని కోరారు. అంతేకాక కోవిడ్‌ సమయాన రద్దయిన కాజీపేట–విజయవాడ, డోర్నకల్‌– భద్రాచలం, కాజీపేట–మణుగూరు, కొల్లాపూ ర్‌ ప్యాసింజర్‌ రైళ్లను పునరుద్ధరించి కాకతీయ రైలుకు తడికలపూడి, చీమలపాడు, బేతంపూడి స్టేషన్లలో హాల్టింగ్‌ ఇవ్వాలని, భద్రాచలం రోడ్‌ నుంచి సికింద్రాబాద్‌కు ఉదయం మరో రైలును మంజూరు చేయాలని ఎంపీ కోరారు.

ఇంటర్నేషనల్‌ సైన్స్‌ ఫెస్టివల్‌కు ఏన్కూరు ఉపాధ్యాయిని

ఏన్కూరు: ఈనెల 6నుంచి 9వ తేదీ వరకు హరియాణా రాష్ట్రం ఛంఢీఘర్‌లోని పంజాబ్‌ యూనివర్సిటీలో జరగనున్న ఇంటర్నేషనల్‌ సైన్స్‌ ఫెస్టివల్‌కు మండలంలోని బురదరాఘవాపురం ఉన్నత పాఠశాల జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు పాగి సుజాత ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా 200 మంది ఉపాద్యాయులను ఎంపిక చేయగా అందులో జిల్లా నుంచి సుజాతకు స్థానం దక్కింది. ‘వికసిత్‌ భారత్‌–2047లో భారతదేశంలో సాంకేతిక అభివృద్ధి ఎలా ఉండబోతోంది’ అన్న అంఽశంపై అందిన ప్రదర్శనల నుంచి అత్యుత్తమైనవి ఎంపిక చేసి సదరు ఉపాధ్యాయులను ప్రతినిధులుగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సుజాతను హెచ్‌ఎం పి.నాగిరెడ్డి, ఉపాధ్యాయులు అభినందించారు.

రవాణా శాఖలో ఆన్‌లైన్‌ సేవలకు అంతరాయం

ఇబ్బందులకు గురైన వాహనదారులు

ఖమ్మంక్రైం: జిల్లా వ్యాప్తంగా రవాణాశాఖా కార్యాలయాల్లో శుక్రవారం సర్వర్‌ డౌన్‌ కావడంతో ఆన్‌లైన్‌ సేవలు నిలిచిపోయాయి. దీంతో వివిధ పనుల నిమిత్తం వచ్చిన వాహనదారులు గంటల తరబడి వేచిఉండాల్సి వచ్చింది. ఖమ్మంతో పాటు వైరా, సత్తుపల్లి కార్యాలయాల్లో ఇదే పరిస్థితి ఎదురుకాగా.. సాంకేతిక సమస్యతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రవాణా శాఖ కార్యాలయాల్లోనూ సేవలకు అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 2గంటల తర్వాత ఆన్‌లైన్‌ సేవలు మొదలైనా అప్పటికే చాలామంది వెనుదిరిగారు. దీంతో వీరికి శనివారం సేవలు అందిస్తామని అధికారులు తెలిపారు.

వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యం

ఏన్కూరు: గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు శ్రద్ధ వహించాలని గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ ఎస్‌.విజయలక్ష్మి సూచించారు. ఏన్కూరు మండలం మూల పోచారంలోని గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలను శుక్రవారం తనిఖీ చేసిన ఆమె మెనూ అమలు, పాఠశాల పరిసరాలు, స్టోర్‌ రూమ్‌, డార్మెటరీలను పరిశీలించారు. ఐటీడీఏ పీఓ రాహుల్‌ చొరవతో పంపిణీ చేసిన ఉద్దీపకం పుస్తకాల ద్వారా బోధన, విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించారు. అనంతరం డీడీ మాట్లాడుతూ ప్రతీ ఉపాద్యాయుడు కొందరు చొప్పున పదో తరగతి విద్యార్థులను దత్తత తీసుకుని 100 శాతం ఫలితాలు సాధించేలా బోధించాలని తెలిపారు. హెచ్‌ఎం జి.నాగరాజు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు బి.రవి, డీఎస్‌.నాగేశ్వరరావు, బి.శోభన్‌, రవి, శ్యామల, రమేష్‌ , సుశ్మిత, ఉషశ్రీ, హర్యానాయక్‌, రాంబాబు, నరసింహారావు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.

సూపర్‌ఫాస్ట్‌ రైళ్లకు  హాల్టింగ్‌ కల్పించండి
1
1/1

సూపర్‌ఫాస్ట్‌ రైళ్లకు హాల్టింగ్‌ కల్పించండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement