ఆరో తరగతిలో పంచాయతీ
టేకులపల్లి/కరకగూడెం: విద్యార్థి దశ నుంచే గ్రామపంచాయతీ పాలనపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్రప్రభుత్వం పంచాయతీ పాలన, విధులు, విధానాలు, బాధ్యతలను వివరిస్తూ పాఠ్యాంశంగా పొందుపర్చింది. ఆరో తరగతి సాంఘికశాస్త్రం పార్ట్–2 పాఠ్యపుస్తకంలో 13వ పాఠ్యాంశంగా ‘గ్రామ పంచాయతీలు’ శీర్షికతో ఏడు పేజీల్లో ఈ పాఠాన్ని ముద్రించారు. గ్రామస్తులకు సౌకర్యాల కల్పన, గ్రామస్థాయిలో ప్రజాస్వామ్యం, గ్రామసభ, ఓటర్ల జాబితా, వార్డులు, రిజర్వేషన్లు, ఎన్నికలు, నిధులు, మండల పరిషత్, జిల్లా పరిషత్ తదితర వివరాలను ఇందులోపొందుపర్చారు. ప్రస్తుతం గ్రామపంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యాన సర్పంచ్, వార్డు మెంబర్లుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు ఈ పాఠాన్ని చదివితే గ్రామపంచాయతీలపై పూర్తి అవగాహన కలుగుతుందని పలువురు చెబుతున్నారు.
రఘునాథపాలెం: బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రఘునాథపాలెం మండలంలో చేసిన అభివృద్ధి పనులే ఈసారి సర్పంచ్ అభ్యర్థులను గెలిపిస్తాయని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ధీమా వ్యక్తం చేశారు. మండలంలోని చిమ్మపూడి, పాపటపల్లి గ్రామాల్లో శుక్రవారం జరిగిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. మండలంలో గత పదేళ్లలో అభివృద్ధి పరుగులు పెట్టిందని, పల్లెల్లో రహదారులు సహా అనేక పనులు బీఆర్‌ఎస్ హయాంలోనే జరిగాయని తెలిపారు. కానీ గత రెండేళ్లుగా కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి నిలిచిపోగా యువత, మహిళలు, రైతులకు ఇచ్చిన హామీలు అమలుకాలేదని చెప్పారు. రైతు రుణమాఫీ, రైతుబంధు పథకాలను అరకొరగా అమలుచేస్తుండడమేకాక ఏకగ్రీవాల పేరిట కాంగ్రెస్ నాయకులు బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. ఈమేరకు చిమ్మపూడి, పాపటపల్లిలో బీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా చిమ్మపూడికి చెందిన సూరంశెట్టి కుటుంబీకులు కాంగ్రెస్ నుండి బీఆర్‌ఎస్‌లో చేరగా పువ్వాడ వారిని ఆహ్వానించారు. అనంతరం పువ్వాడ చింతగుర్తి, గణేశ్వరం, వీవీ.పాలెం తదితర గ్రామాల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, బీఆర్‌ఎస్ నాయకులు పగడాల నాగరాజు, అజ్మీరా వీరూనాయక్, బీరెడ్డి నాగచంద్రారెడ్డి, గుత్తా రవి, కొండపర్తి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మంక్రైం/చింతకాని/కూసుమంచి: గ్రామపంచాయితీ ఎన్నికల దృష్ట్యా గ్రామాల్లో టాస్క్‌ఫోర్స్ బృందాలు తనిఖీలు ముమ్మరం చేశాయి. ఈ సందర్భంగా బెల్ట్ షాపులను పూర్తిగా కట్టడి చేస్తున్నట్లు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ సత్యనారయణ తెలిపారు. కొణిజర్ల, రఘునాధపాలెం, చింతకాని, వీఎం బంజర, ముదిగొండ, ఖమ్మం రూరల్, సత్తుపల్లి తిరుమలాయపాలెం, వేంసూరు తదితర మండలాల్లో గత నాలుగు రోజుల్లో చేపట్టిన తనిఖీల్లో రూ.4లక్షల విలువైన 600లీటర్ల మద్యాన్ని సీజ్ చేసినట్లు వెల్లడించారు. కాగా, చింతకాని మండలం నాగులవంచ సమీపాన శుక్రవారం చేపట్టిన తనిఖీల్లో చిన్నమండవకు చెందిన పర్సగాని నాగేశ్వరరావు తీసుకెళ్తున్న మద్యాన్ని స్వాధీ నం చేసుకున్నట్లు ఎస్సై వీరేందర్ తెలిపారు. అలాగే, కూసుమంచి మండలంలోని వివిధ ప్రాంతాల మీదుగా మద్యం తరలిస్తున్న కాసాని ఎల్లయ్య, కోట్ల వెంకటేశ్వర్లు, భూక్యా పవన్‌కుమార్ నుంచి రూ.55,197 విలువైన మద్యంతోపాటు వాహనాలు స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేసినట్లు ఎస్సై నాగరాజు తెలిపారు.
పల్లెపాలనపై అవగాహన కల్పించేలా పాఠం
మాజీ మంత్రి
పువ్వాడ అజయ్
ఆరో తరగతిలో పంచాయతీ
ఆరో తరగతిలో పంచాయతీ
ఆరో తరగతిలో పంచాయతీ


