దుప్పుల వేట.. పెళ్లిలో విందు
● మాజీ ఎమ్మెల్యే సోదరుడి కొడుకు లొంగుబాటు ● ఆయనతో పాటు ఇంకొకరి రిమాండ్
సత్తుపల్లి: సత్తుపల్లి నీలాద్రి అర్బన్ పార్కులో దుప్పులు వేట కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మెచ్చా రఘు శుక్రవారం సత్తుపల్లి ఎఫ్‌డీఓ వాడపల్లి మంజుల సమక్షాన లొంగిపోయాడు. అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు సోదరుడి కుమారుడైన ఆయనతో పాటు దమ్మపేట మండలం గొర్రెగుట్టకు చెందిన చెందిన కుంజా భరత్ కూడా లొంగిపోగా అధికారులు విచారణ చేపట్టారు. సత్తుపల్లిలో దుప్పుల వేటపై సాక్షి’లో గతనెల 29నుంచి ‘తూటా దూసుకెళ్తోంది.., అటు నగదు.. ఇటు వేట, ఇంటి దొంగల్లో’ టెన్షన్..’ శీర్షికలతో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. దీంతో అటవీశాఖ అధికారులు విచారణ చేపట్టి అర్బన్‌పార్క్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పంతంగి గోపికృష్ణ, శొంఠి శ్రీరాంప్రసాద్‌ను కొద్దిరోజుల క్రితమే అరెస్ట్ చేశారు. ప్రస్తుతం రఘు, భరత్ లొంగిపోగా విచారణ అనంతరం వారిద్దరిని సాయంత్రం కోర్టు ఆదేశాలతో రిమాండ్‌కు తరలించారు. అయితే, వేటలో కీలకంగా రఘు వ్యవహరించినట్లు తెలుస్తుండగా కేసులో ఆయను ఏ2గా నమోదు చేసి గోపీకృష్ణ, శ్రీరాంప్రసాద్, భరత్ పేర్లను ఏ1, ఏ3, ఏ4గా చేర్చడం గమనార్హం.
దుప్పి మాంసంతో విందు
దుప్పుల వేటలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న దమ్మపేట మండలం తాటి సుబ్బన్నగూడెంకు చెందిన మెచ్చా రఘు వివాహ వేడుక ఇటీవల సత్తుపల్లిలో జరిగింది. సత్తుపల్లి అర్బన్‌పార్కు దుప్పులను వేటాడి ఈ విందులో వడ్డించారని ఆరోపణలు వచ్చాయి. ఈక్రమాన ఆయన లొంగిపోగా, ఇప్పటి వరకు ఎన్నిసార్లు వేటాడారు, అటవీశాఖ సిబ్బంది ఎవరైనా సహకరించారా, వేటలో ఎవరెవరు పాల్గొన్నారనే వివరాలు రాబట్టేందుకు ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. అంతేకాక రఘు తుపాకీ ఎక్కడ కొన్నాడు.. అశ్వారావుపేట పోలీస్‌స్టేషన్‌లో లైసెన్స్ ఉన్న తుపాకీ సరెండర్ చేసినా ఇంకా ఆయన వద్ద తుపాకులు ఉన్నాయా అనే వివరాలు రాబట్టినట్లు సమాచారం. కాగా, సత్తుపల్లి అర్బన్ పార్కులోకి అక్టోబర్‌లో ఓ రోజు రాత్రి 11 గంటల సమయాన కొందరు వ్యక్తులు కారులో లోపలకు వెళ్లి ఐదు దుప్పులను వేటాడి తీసుకెళ్లినట్లు అధికారులు సీసీ కెమెరాల పుటేజీల ద్వారా గుర్తించినట్లు సమాచారం తెలిసింది. ఆ రోజు ఆరు దుప్పులు వేటాడగా.. ఐదు దుప్పులే వీరికి దొరికాయని, ఒకటి గాయాలతో తప్పించుకుని మరుసటి రోజు జనావాసాల్లోకి వచ్చినట్లు తెలిసింది. దీంతో అటవీశాఖ అధికారులు వైద్యం చేయించి పార్క్‌లో వదిలిపెట్టారు. ఈ అంశాలన్నింటినీ నిర్ధారించుకునేలా రఘు, భరత్‌ను విడివిడిగా విచారించాక రిమాండ్‌కు తరలించినట్లు సత్తుపల్లి ఎఫ్‌డీఓ మంజుల వెల్లడించారు. కాగా, అటవీ జంతువులను వేటాడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎఫ్‌ఓ సిద్ధార్థ్ విక్రమ్‌సింగ్ స్పష్టం చేశారు.


