ఎన్నికల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్
ఖమ్మం సహకారనగర్: పంచాయతీ ఎన్నికల విధులు నిర్వర్తించే సిబ్బంది తమ ఓటు హక్కు వినియోగించుకునేలా పోస్టల్ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అందరికీ పోస్టల్ బ్యాలెట్లు జారీ చేయాలని ఉద్యోగులకు సూచించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఐ.రాణి కుముదిని గురువారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించగా నామినేషన్ల పరిశీలన, గుర్తుల కేటాయింపు, బ్యాలెట్ పేపర్ల ముద్రణ తదితర అంశాలపై సూచనలు చేశారు. ఈ వీసీకి జిల్లా నుంచి కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ హాజరయ్యారు. అనంతరం ఉద్యోగులతో సమావేశమైన కలెక్టర్ మాట్లాడుతూ వార్డుసభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నికై న పంచాయతీల్లో ఉప సర్పంచ్ ఎన్నికలకు వెంటనే నిర్వహించాలని సూచించారు. అలాగే, ఏకగ్రీవ సర్పంచ్ స్థానాల ఫలితాలు నిబంధనల ప్రకారం ప్రకటించాలని తెలిపారు. అంతేకాక పోస్టల్ బ్యాలెట్ కోసం వచ్చిన ప్రతీ దరఖాస్తును పరిశీలించి అర్హులందరికీ జారీ చేయాలని సూచించారు. మొదటి విడత పోలింగ్ సిబ్బంది ఈనెల 8న, రెండో విడతకు డిసెంబర్ 12వ తేదీన, మూడో విడతకు ఈనెల 15న పోస్టల్ బ్యాలెట్ దాఖలకు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. అంతేకాక సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ పరిశీలకుల నియామకం చేపట్టాలని కలెక్టర్ సూచించారు. ఈసమావేశంలో డీఆర్‌ఓ ఏ.పద్మశ్రీ, సీపీఓ ఏ.శ్రీనివాస్, జిల్లా ఉపాధికల్పన అధికారి శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి


