విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
సీసీఎఫ్ బీమానాయక్
ఖమ్మంవ్యవసాయం: అటవీ శాఖ అధికారులు, ఉద్యోగులు బాధ్యతలను విస్మరిస్తే చర్యలు తప్పవని చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్(సీసీఎఫ్) బీమానాయక్ హెచ్చరించారు. జిల్లా అటవీ అధికారి(డీఎఫ్‌ఓ) సిద్దార్థ్ విక్రమ్ సింగ్, ఇతర అధికారులతో కలిసి సోమవారం ఆయన ఖమ్మం దానవాయిగూడెంలో నిర్మించిన బీట్ ఫీసర్ క్వార్టర్లను పరిశీలించాక వెలుగుమట్లలో అర్బన్ పార్క్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పార్కు నిర్వహణ, టికెట్ల విక్రయం, వచ్చిన ఆదాయం ఎంత అనే వివరాలు ఆరా తీశారు. ఈ సందర్భంగా పార్కు నిర్వహణలో పలు లోపాలను గుర్తించిన సీసీఎఫ్, డీఎఫ్‌ఓలు అక్రమాలు జరిగితే బాధ్యులపై చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఇటీవల కారేపల్లి రేంజ్ నుంచి పార్క్‌కు తీసుకువచ్చిన రెండు నెమళ్ల ఆరోగ్యాన్ని పరిశీలించారు. అలాగే, ఔషధ మొక్కల పెంపకం, స్విమ్మింగ్ పూల్, బోట్ల నిర్వహణ వివరాలు ఆరా తీశారు. ఆతర్వాత తల్లాడ ఫారెస్టు రేంజ్‌లో అభివృద్ధి పనులను పరిశీలించిన అధికారులు ఓ క్షేత్రంలో నరికిన ఎర్ర చందనం లాట్ వివరాలు తెలుసుకున్నారు. అక్కడి నుంచి జిల్లా అటవీ కార్యాలయానికి వెళ్లిన సీపీఎఫ్, డీఎఫ్‌ఓలు వన్యప్రాణుల వేట, సండ్ర కలప అక్రమ రవాణా వ్యవహారాలపై చర్చించారు. ఖమ్మం, సత్తుపల్లి డివిజన్ల అటవీ అధికారి మంజుల, రేంజ్ అటవీ అధికారి బాలరాజు తదితరులు పాల్గొన్నారు.


