పంచాయతీ ఓటర్ల కోసం ‘టీ–పోల్ యాప్’
భద్రాచలంఅర్బన్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లకు సులభంగా ఎన్నికల సమాచారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం టీ–పోల్ (టీఈ పీఓఎల్‌ఎల్) మొబైల్ యాప్‌ను రూపొందించింది. జిల్లాలోని పోలింగ్ కేంద్రాల వివరాలు, ఓటరు స్లిప్పులను కోసం, ఎన్నికల నిర్వహణలో ఫిర్యాదు చేయడానికి ఈ యాప్ సాయపడుతుంది. గూగుల్ ప్లేస్టోర్‌లో ఈ యాప్ డౌలోడ్ చేసుకోవాలని అధికారులు ఓటర్లకు సూచిస్తున్నారు. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
అభ్యర్థి అజ్ఞాతవాసంపై ఆరా
ఇల్లెందురూరల్: మండలంలోని సుభాష్‌నగర్ గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్, ప్రస్తుత స్థానిక సమరంలో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న వల్లాల మంగమ్మ అజ్ఞాతవాసంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. శనివారం రాత్రి రహస్యంగా సుభాష్‌నగర్‌లోని ఆమె ఇంటికి వెళ్లి విచారణ చేపట్టారు. ఎన్నికల నామినేషన్ గడువు సమీపిస్తుండటంతో అభ్యర్థి అజ్ఞాతవాసం ఘటన బీఆర్‌ఎస్ నేతల్లోనూ ఉత్కంఠ కలిగిస్తోంది. కాంగ్రెస్ తరఫున బరిలో నిలిచే అభ్యర్థి నేటికీ ఖరారు కాకపోవడంపై సందేహంతో ఉన్న బీఆర్‌ఎస్ నేతలు తరచూ మంగమ్మ ఆచూకీ కోసం ఓ వైపు ఆరా తీస్తూనే మరోవైపు ప్రత్యామ్నాయ అభ్యర్థి కోసం చర్చిస్తున్నారు.


