ఖమ్మం–దేవరపల్లి హైవే పరిశీలన
పనుల్లో పురోగతిపై మంత్రి తుమ్మల ఆరా
ఖమ్మంఅర్బన్: ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారి పనులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం పరిశీలించారు. కొదుమూరు నుంచి సత్తుపల్లి వరకు హైవేపై ప్రయాణించిన ఆయన పనులపై ఆరా తీస్తూ వేగం పెంచాలని అధికారులు, కాంట్రాక్టర్లకు ఫోన్ ద్వారా సూచనలు చేశారు. హైవే నిర్మాణం పూర్తయితే ఖమ్మం – ఏపీ మధ్య రాకపోకలు సులభమై వ్యాపార, రవాణా రంగాలకు ఊతమిస్తుందని పేర్కొన్నారు. కొన్నిచోట్ల హైవే విస్తరణ, రోడ్డు లెవలింగ్, వంతెన నిర్మాణాలపై అధికారులతో సమీక్షించారు. ధంసలాపురం వద్ద రైల్వే వంతెన పనులు, ఖమ్మం కలెక్టరేట్ సమీపాన కొదుమూరు జంక్షన్ వద్ద నుంచి జంగారెడ్డిగూడెం వరకు రాకపోకలు సాగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
నేడు ఖమ్మంలో పర్యటన
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం ఖమ్మంలో పర్యటించనున్నారు. మున్నేరు ప్రొటెక్షన్ వాల్, కేబుల్ బ్రిడ్జి, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులపై ఉదయం 11 గంటలకు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సమీక్ష నిర్వహిస్తారు.
‘దిత్వా’పై అప్రమత్తంగా ఉండాలి
వరి కోతలు వాయిదా వేయడమే మేలు
ఖమ్మవ్యవసాయం: ‘దిత్వా’ తుపాను నేపథ్యాన రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. ఈ తుపాను 65 కిలోమీటర్ల గాలి వేగంతో ఉత్తర తమిళనాడులోని నాగపట్నంకు తూర్పు ఆగ్నేయంగా నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉందని తెలిపారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ప్రభావం చూపే అవకాశముందని చెబుతుండగా, ఆదివారం వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఆకాశం మేఘావృతమై చల్లని గాలులు తీవ్రమయ్యాయి. సోమ, మంగళవారాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొని ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశముందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యాన కల్లాల్లో, విక్రయ కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని టార్పాలిన్లతో రక్షించుకోవాలని, మిగతా రైతులు వరికోతలను వాయిదా వేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య ఒక ప్రకటనలో సూచించారు.
ప్రజావాణి
తాత్కాలికంగా రద్దు
ఖమ్మం సహకారనగర్ : అధికారులు, సిబ్బంది స్థానిక సంస్థల ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉన్నందున ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు కలెక్టరేట్‌లో ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి (గ్రీవెన్స్ డే) కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి, ఫిర్యాదులు ఇచ్చేందుకు కలెక్టరేట్‌కు రావొద్దని సూచించారు.
పెండింగ్ బిల్లుల
విడుదలపై హర్షం
ఖమ్మం సహకారనగర్ : ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల పెండింగ్ బిల్లులు నవంబర్ నెలకు సంబంధించి రూ.700 కోట్లు విడుదల చేయడం పట్ల పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కట్టా శేఖర్‌రావు, ఆర్.రంగారావు హర్షం వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలంటూ రెండు రోజుల క్రితం తమ సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని అమరవీరుల స్తూపం వద్ద ధర్నా నిర్వహించామని తెలిపారు.
కిన్నెరసానిలో
సండే సందడి
పాల్వంచరూరల్: పర్యాటక ప్రాంతమైన కిన్నెరసానిలో ఆదివారం సందడి నెలకొంది. మండల పరిధిలోని కిన్నెరసానికి వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు తరలివచ్చారు. డ్యామ్, జలాశయం, డీర్ పార్కులోని దుప్పులను వీక్షించారు. ప్రకృతి అందాలను ఆస్వాదించారు. 473 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్‌లైఫ్ శాఖకు రూ.29,065 ఆదాయం లభించింది. 350 మంది బోటు షికారు చేయగా టూరిజం కార్పొరేషన్ సంస్థకు రూ.19,600 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు.


