హెపటైటిస్.. ప్రాణాంతకం..
అవగాహన తప్పనిసరి
● ఎయిడ్స్, హెచ్‌ఐవీలాగే సంక్రమిస్తున్న వైనం.. ● ప్రజల్లో అవగాహన లేక పెరుగుతున్న బాధితులు ● జిల్లాలోనే వైరా మండలంలో అత్యధిక కేసులు
వైరారూరల్: గతంలో లైంగిక సంబంధాల్లో సురక్షిత విధానాలు పాటించక పలువురు ఎయిడ్స్, హెచ్‌ఐవీ బారిన పడి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ప్రస్తుతం వైద్యులకు తప్ప సాధారణ పజ్రలకు తెలియని మరో ప్రాణాంతక వ్యాధి ‘హెపటైటిస్’విస్తరిస్తోంది. ఈ వ్యాధి చాప కింద నీరులా విస్తరిస్తూ రోజురోజుకూ బాధితుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళనకు గురిచేస్తోంది. హెపటైటిస్–సీ ఆర్‌ఎన్‌ఏ వైరస్ కాగా హెపటైటిస్–బీకి డీఎన్‌ఏ వైరస్‌గా పేరుంది. ఈ కేసులు జిల్లాలోని వైరా మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాల్లోనే కాక మండలంలోని గొల్లపూడి, ఖానాపురం, గొల్లెనపాడు, అష్టగుర్తి, రెబ్బవరంలో నమోదవుతున్నాయని సమాచారం. వ్యాధిపై అవగాహన లేకపోవడంతో శరీరంలోని అవయవాలను దెబ్బతీస్తూ ప్రాణాంతకంగా మారుతోందని తెలిసింది. వ్యాధి ఇంట్లో ఒకరికి సోకితే కుటుంబమంతా పరీక్షలు చేయించుకుని జాగ్రత్తలు పాటించాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.
వ్యాధి సంక్రమిస్తుంది ఇలా..
హెపటైటిస్–సీ 0.6 నుంచి 6శాతం నీడిల్ ద్వారా సోకుతుంది. హెపటైటిస్–బీ 30శాతం నీడిల్ ఇన్‌ఫెక్షన్ ద్వారా సంక్రమిస్తుంది. సురక్షితం కాని లైంగిక సంబంధాలు, హెపటైటిస్ సోకిన వ్యక్తి రక్తదానం చేయడం, గ్రామీణ వైద్యులు నీడిల్ మార్చకుండా ఇంజక్షన్ చేయడం, సెలూన్ షాపుల్లో బ్లేడ్లు మార్చకపోవడం వంటి కారణాలతో వ్యాధి ప్రబలుతున్న ట్లు తేలిందని సమాచారం. ఇదికాక మాదక ద్రవ్యా ల వాడకం, డయాలసిస్ షేషంట్లు కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నారు.
లక్షణాలు.. నివారణ చర్యలు
హెపటైటిస్–బీ వ్యాధి బారిన పడిన వారికి నిత్యం కామెర్లు కావడం, వాంతులు, కడుపులో తిప్పినట్లు అనిపించడం, అధిక నీరసం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు తప్ప నిసరిగా పరీక్ష చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈమేరకు మొదట స్క్రీనింగ్ ర్యాపిడ్ పరీక్షలు చేయించాలి. పాజిటివ్‌గా తేలితే ఎలీసా పరీక్ష ద్వారా నిర్ధారించుకుని వైరల్‌లోడ్ పరీక్షలు కూడా చేయించాలి. ఇక హెపటైసిస్–బీ, సీ వ్యాధి సోకిన వారు తమ రక్తాన్ని దానం చేయొద్దు. ఒకరు వాడిన నీడిల్‌ను మరొకరు వాడకపోవడంతో పాటు లైంగిక సంబంధాల్లో సురక్షిత చర్యలు పాటించాలి. కుటుంబంలో ఎవరికై నా హెపటైటిస్–బీ, సీ సోకితే కుటుంబమంతా పరీక్షలు చేయించుకొని వైద్యాధికారుల సూచనలు పాటించాలి. హెపటైటిస్–సీ పాజిటివ్ గా తేలితే మూడు నెలలు, హెపటైటిస్–బీ అయితే జీవింతాంతం మందులు వాడాలి. లేనిపక్షంలో లివర్ దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని వైద్యులు తెలిపారు. కాగా, చికిత్స సామాన్యులకు అందుబాటులోకి రాగా, రికవరీ రేటు కూడా 99 శాతానికి పెరిగిందని వైద్యులు చెబుతున్నారు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో నెలకు రూ.15 వేల విలువైన మందులు ఉచితంగా పంపిణీ చేస్తున్నందున బాధితు లు సద్వినియోగం చేసుకోవాలని వైద్య, ఆరోగ్యశాఖాధికారులు సూచిస్తున్నారు.
ప్రజలు హెపటైటిస్–బీ, సీపై అవగాహన కలిగి ఉండాలి. ఈ వ్యాధి సోకితే కాలేయ సంబంధిత సమస్యలే కాక చర్మం, కిడ్నీ ఇతర వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. కుటుంబంలో ఒకరికి వ్యాధి నిర్ధారణ జరిగితే అందరూ పరీక్షలు చేయించుకొని జాగ్రత్తలు పాటించాలి. వైరా మండలంలో అత్యధిక కేసులు ఉన్నట్లు తేలింది. ప్రజలు ఈ వ్యాధిపై అవగాహన పెంచుకొని తగిన జాగ్రత్తలు పాటించాలి.
–బత్తినేని శ్రీహర్ష, ప్రభుత్వ వైద్యాధికారి, వైరా
హెపటైటిస్.. ప్రాణాంతకం..
హెపటైటిస్.. ప్రాణాంతకం..


