నగర వాసులకు నిరంతరం తాగునీరు
ఖమ్మం అర్బన్: ఖమ్మం నగరవాసులకు 24 గంటల పాటు తాగునీరు సరఫరా చేసేలా ప్రభుత్వం దశలవారీగా చర్యలు చేపడుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం 35వ డివిజన్‌లో రూ.50.25 లక్షలతో నిర్మించే సీసీ రోడ్డు పనులకు శనివారం శంకుస్థాపన చేశాక ఆయన మాట్లాడారు. అమృత్ పథకంలో భాగంగా రూ.220 కోట్ల విలువైన పనులకు డిసెంబర్‌లో టెండర్లు ఖరారు చేసి వేసవి నాటికి నిరంతరం తాగునీటి సరఫరా అయ్యేలా చూస్తామని తెలిపారు. నగరంలో చేపట్టే ప్రతీ అభివృద్ధి పని దశాబ్దాల అవసరాలకు అనుగుణంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. కాగా, పరిశుభ్రతలో ప్రజలు, కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. కాగా, పర్యాటక అభివృద్ధిలో భాగంగా ఖిలాపై రోప్‌వే, లకారం చెరువు పక్కన శిల్పారామం నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మేయర్ పునుకొల్లు నీరజ, కమిషనర్ అభిషేక్ అగస్త్య, కార్పొరేటర్లు యల్లంపల్లి వెంకటరావు, కమర్తపు మురళీ, కన్నం వైష్టవీ ప్రసన్నకృష్ణ, కాంగ్రెస్ కేఎంసీ అధ్యక్షుడు నాగండ్ల దీపక్‌చౌదరి, నాయకులు బాలగంగాధర్ తిలక్ తదితరులు పాల్గొన్నారు.


