పైరవీ కాదు.. పట్టు ఎవరికి?
● ఆశావహుల జాబితా వడపోస్తున్న పార్టీలు ● జన, ఆర్థిక, అంగబలం ఉన్న వారి కోసం అన్వేషణ ● గెలుపు గుర్రాలనే బరిలో దింపేలా సర్వే చేయిస్తున్న కాంగ్రెస్
సాక్షిప్రతినిధి, ఖమ్మం: సర్పంచ్ పదవి కోసం నామినేషన్ వేస్తున్న వారంతా తమకు పార్టీ మద్దతు ఉందని ప్రకటించాలంటూ ముఖ్య నేతలతో పైరవీలకు దిగుతున్నారు. ప్రధానంగా అధికార కాంగ్రెస్ పార్టీలో ఈ తాకిడి ఎక్కువగా ఉంది. సర్పంచ్ అభ్యర్థిగా తమనే ఖరారు చేయాలని నేరుగా మంత్రులను కలవడం లేదంటే మంత్రులు, ఎమ్మెల్యేలకు దగ్గరగా ఉన్న నేతలతో రాయబారాలు నెరుపుతున్నారు. అయితే పైరవీలు కాకుండా.. జనబలం, ఆర్థిక, అంగ బలం ఎవరికి ఉంది.. వారి గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయన్న అంశంపై అధికార కాంగ్రెస్ పార్టీ గ్రామాల వారీగా సర్వే చేయిస్తోంది. అలాగే బీఆర్‌ఎస్, వామపక్షాలు, బీజేపీ కూడా కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థులు ఎవరా అని అన్వేషిస్తున్నాయి.
మాకు మద్దతు ఇవ్వండి..
బరిలో నిలవాల్సిందేననే తపనతో ఉన్న ఆశావహులు నామినేషన్లు దాఖలు చేశారు. అనంతరం సర్పంచ్ అభ్యర్థిగా తమకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్‌లోని మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులను కోరుతున్నారు. నామినేషన్ ఉపసంహరించుకోవాలని తమకు సూచించొద్దని కోరుతూనే వివిధ మార్గాల్లో పార్టీ పెద్దలపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. రెండు, మూడో విడతల్లో జరిగే పంచాయతీల్లోనూ ముందుస్తుగా ఒప్పందం చేసుకుని ఒక్కరే బరిలో నిలిచేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవసరమైతే ఏకగ్రీవం, లేదంటే బరి అన్నట్లుగా ఈ ఒప్పందాలు ఉంటున్నాయి.
కాంగ్రెస్ నుంచే...
గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఎక్కువ మంది కాంగ్రెస్ మద్దతుతో బరిలోకి దిగాలని ఉవ్విళ్లూరుతున్నారు. మొదటి విడత నామినేషన్ల దాఖలు గడువు శనివారంతో ముగియనుంది. ఈ విడతలో ఎన్నిక జరిగే జీపీల్లో ఆశావహులు నామినేషన్లు దాఖలు చేయగా.. రెండు, మూడో విడత ఎన్నిక జరిగే స్థానాల్లోనూ కాంగ్రెస్ మద్దతు కోసం పలువురు ప్రయత్నాలు ప్రారంభించారు. మరోపక్క నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల వడపోతకు కాంగ్రెస్ శ్రీకారం చుట్టింది. బరిలో నిలిచేందుకు ఎవరు అర్హులనే అంశంపై ఆరా తీయిస్తోంది. మిగతా పార్టీలు కూడా బలమైన అభ్యర్థులను పోటీలో ఉంచేలా కసరత్తు చేస్తున్నాయి.
ఎవరైతే సరి?
ఎన్నికల్లో ఎవరిని అభ్యర్థిగా నిలిపితే విజయం దక్కుతుందనే అంశంపై అధికార కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది. ఇందుకోసం గ్రామపంచాయతీల వారీగా సర్వే చేయిస్తోంది. కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో చాలామంది పోటీకి సిద్ధమవుతున్నందున గ్రామంలో పట్టు ఉండి ఆర్థిక, అంగబలం ఎవరి ఉందో సర్వే ద్వారా తేల్చాకే పార్టీ మద్దతు ప్రకటించాలని నిర్ణయించింది. దీంతో ఆశావహులు ఎవరికి వారు తుది జాబితాలో తమ పేరు ఉండేలా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.


