● నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు ● ఎన్నికల పరిశీలకులు కాళీచరణ్ సుధామరావు
ఖమ్మం సహకారనగర్: జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా జరిగేలా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టాలని ఎన్నికల సాధారణ పరిశీలకుడు ఖర్తడే కాళీచరణ్ సుధామరావు సూచించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం ఆయన కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పోలీస్ కమీషనర్ సునీల్‌దత్, అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి నోడల్ అధికారులతో సమావేశమయ్యారు. ఎవరూ నిబంధనలు ఉల్లంఘించకుండా పర్యవేక్షించాలని, ఓటర్లను ప్రలోభపెట్టేందుకు యత్నించే అభ్యర్థులకు అడ్డుకట్ట వేయాలని తెలిపారు. ఫిర్యాదుల స్వీకరణకు ఏర్పాటుచేసిన టోల్‌ఫ్రీ నంబర్ 1077పై విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించిన ఆయన ఎన్నికల సిబ్బంది శిక్షణ, బ్యాలెట్ పేపర్ల ముద్రణపై ఆరాతీశారు. అనంతరం కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ ఫిర్యాదుల పరిష్కారానికి డీఆర్‌ఓ ఆధ్వర్యంలో వ్యవస్థ ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రలోభాలు, కుల, మతాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలుచేసే వారిని గుర్తించాలని సూచించారు. పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ మాట్లాడుతూ ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. అనంతరం పరిశీలకుడు సుధామరావుతో ఆటు అధికారులు కలెక్టరేట్‌లోని కంట్రోల్ రూమ్, ఎంసీఎంసీ సెల్, మీడియా సెంటర్లను పరిశీలించి ఉద్యోగులకు సూచనలు చేశారు. ఈసమావేశాల్లో కల్లూరు సబ్‌కలెక్టర్ అజయ్‌యాదవ్, డీఆర్‌ఓ పద్మశ్రీ, జెడ్పీ సీఈఓ దీక్షారైనా, డీఆర్‌డీఓ సన్యాసయ్య, డీపీఓ ఆశాలత, డీపీఆర్‌ఓ ఎం.ఏ.గౌస్, డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి, డీఈఓ చైతన్యజైనీ, సీపీఓ శ్రీనివాస్, ఆర్‌టీఓ వెంకటరమణ, డీసీఓ గంగాధర్, ఆర్‌డీఓ నరసింహారావు, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ ఎం.అపూర్వ, డిప్యూటీ సీఈఓ నాగపద్మజ, ఈడీఎం దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలి..
రఘునాథపాలెం: గ్రామపంచాయతి ఎన్నికల నామినేషన్ల స్వీకరణ సందర్భంగా అధికారులు అప్రమత్తంగా ఉంటూ అభ్యర్థులు నిబంధనలు పాటించేలా పర్యవేక్షించాలని ఎన్నికల పరిశీలకుడు ఖర్తడే కాళీచరణ్ సుధామరావు సూచించారు. రఘునాథపాలెం మండలంలోని చిమ్మపూడి, కోయచలకలో నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పోలీసు కమిషనర్ సునీల్‌దత్‌తో కలిసి ఆయన తనిఖీ చేశారు. నామినేషన్ పత్రాల్లో అన్ని వివరాలు నింపేలా అవగాహన కల్పించాలని తెలిపారు. కలెక్టర్ అనుదీప్ మాట్లాడగా డీపీఓ ఆశాలత, డీఆర్‌డీఓ సన్యాసయ్య, తహసీల్దార్ శ్వేత, ఎంపీడీఓ అశోక్‌కుమార్, ఎంపీఓ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్వోలు లింగానాయక్ పాల్గొన్నారు.


