న్యాయం చేయాలని మృతదేహంతో రాస్తారోకో
చింతకాని: మండలంలోని నాగులవంచ రైల్వేకాలనీకి చెందిన ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ శెట్టిపోగు రంగారావు విద్యుదాఘాతంతో బుధవారం మృతి చెందాడు. ఖమ్మంలో శవపరీక్ష చేసిన అనంతరం స్వగ్రామానికి తీసుకెళ్లే క్రమాన ఆయన బంధువులు మృతదేహంతో ఆందోళన చేపట్టారు. రంగారావు కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ నాగులవంచలోని ఖమ్మం–బోనకల్ ప్రధాన రహదారిపై గంటపాటు రాస్తారోకో నిర్వహించారు. దీంతో రహదారికి ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. చింతకాని, బోనకల్, ఖమ్మం ఎస్సైలు వీరేందర్, వెంకన్న, నాగుల్‌మీరా చేరుకుని ఆయన కుటుంబీకులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినకపోగా తోపులాట జరిగింది. వైరా సీఐ వెంకటప్రసాద్ చేరుకుని రాస్తారోకో చేస్తున్న వారిని చెదరగొట్టారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించవద్దని మృతుడి కుటుబసభ్యులకు నచ్చచెప్పాక రాకపోకలకు పునరుద్ధరించారు.


