పొత్తులు.. ఎత్తులు | - | Sakshi
Sakshi News home page

పొత్తులు.. ఎత్తులు

Nov 28 2025 8:43 AM | Updated on Nov 28 2025 8:43 AM

పొత్త

పొత్తులు.. ఎత్తులు

● స్కీంలు కలిసొస్తాయన్న జోష్‌లో కాంగ్రెస్‌ పార్టీ ● మెజార్టీ స్థానాల్లో పట్టు కోసం బీఆర్‌ఎస్‌ కసరత్తు ● కొన్నిచోట్ల బీఆర్‌ఎస్‌ – సీపీఎం మధ్య సయోధ్య ● బలాబలాల ఆధారంగా సీపీఐ.. పోటీకి సై అంటున్న బీజేపీ కాంగి‘రేసు’లో ఆశావహులు బారెడు బీఆర్‌ఎస్‌.. తగ్గేదే లే సత్తా చాటాలని కమ్యూనిస్టులు పోటీకి సై అంటున్న బీజేపీ

● స్కీంలు కలిసొస్తాయన్న జోష్‌లో కాంగ్రెస్‌ పార్టీ ● మెజార్టీ స్థానాల్లో పట్టు కోసం బీఆర్‌ఎస్‌ కసరత్తు ● కొన్నిచోట్ల బీఆర్‌ఎస్‌ – సీపీఎం మధ్య సయోధ్య ● బలాబలాల ఆధారంగా సీపీఐ.. పోటీకి సై అంటున్న బీజేపీ

సాక్షిప్రతినిధి, ఖమ్మం: గ్రామపంచాయతీ ఎన్నికల తొలివిడత నామినేషన్ల పర్వం మొదలుకావడంతో జిల్లాలో ‘స్థానిక’ రాజకీయం వేడెక్కింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పటిష్టం కావాలంటే స్థానిక ఎన్నికలే అన్ని పార్టీలకు కీలకంగా నిలవనున్నాయి. ఈనేపథ్యాన ప్రభుత్వ పథకాల ఫలాలతో మెజార్టీ స్థానాల్లో విజయ దుందుభి మోగిస్తామన్న ధీమా అధికార కాంగ్రెస్‌ పార్టీలో కనిపిస్తోంది. మరోవైపు కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఇచ్చి తమ బలం నిరూపించుకోవాలని బీఆర్‌ఎస్‌ ప్రయత్నాలు మొదలుపెట్టింది. బలం ఉన్న చోట ఒంటరిగా, కొన్ని పంచాయతీల్లో బీఆర్‌ఎస్‌తో కలిసి వెళ్లేందుకు సీపీఎం నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇదే సమయాన వామపక్షాలతో కలిసి వెళ్లడం, బలం కలిగిన జీపీల్లో ఒంటరిగా పోటీ చేయడంపై సీపీఐ దృష్టి సారించింది. కొన్ని చోట్ల కాంగ్రెస్‌తో కలిసి వెళ్లాలని మండల స్థాయి నుంచి నేతలు ప్రతిపాదించినట్లు తెలిసింది. ఇవికాక బీజేపీ, సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌ పార్టీలు కూడా ఎన్నికల్లో సత్తా చాటేలా ప్రయత్నిస్తున్నాయి. మొత్తంగా అధికార కాంగ్రెస్‌ పార్టీ ఏకగ్రీవాలపై దృష్టి సారించగా.. మిగతా పార్టీలు పొత్తుల, ఎత్తులతో బలనిరూపణకు సై అంటున్నాయి.

పార్టీ అఽధికారంలో ఉండడంతో సర్పంచ్‌, వార్డుసభ్యులుగా బరిలోకి దిగేందుకు కాంగ్రెస్‌ శ్రేణులు పలువురు ఉవ్విళ్లూరుతున్నారు. గత ఎన్నికల సమయాన పార్టీ అధికారంలో లేకపోవడంతో ఆ పార్టీ మద్దతుదారులకు అత్తెసరు సర్పంచ్‌ స్థానాలే దక్కాయి. ఈసారి మాత్రం మెజార్టీ స్థానాలపై పార్టీ నజర్‌ పెట్టింది. అవకాశమున్న చోట ఏకగ్రీవాలకు ప్రయత్నించాలని జిల్లా, స్థానిక నేతలను ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు పూరమాయించినట్లు చర్చ జరుగుతోంది. ఖమ్మం నియోజకవర్గ పరిధి రఘునాథపాలెం మండలంలో ఏకగ్రీవమైన జీపీలకు నియోజకవర్గ అభివృద్ధి నిధుల కింద రూ.10 లక్షల చొప్పున ఇవ్వనున్నట్లు ఇప్పటికే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ఇక నోటిఫికేషన్‌ రాకముందు మహిళలకు చీరలు, ఎస్‌హెచ్‌జీలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేయడమే కాక పంచాయతీల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జోరుగా చేశారు. ఆయా పథకాలతో లబ్ధి పొందిన మహిళలు, వారి కుటుంబీకులు తమ పార్టీకి అండగా నిలు స్తారన్న ధీమా కాంగ్రెస్‌ పార్టీలో వ్యక్తమవుతోంది.

బీఆర్‌ఎస్‌కు పంచాయతీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని ఒక్కో స్థానంతోనే ఆ పార్టీ సరి పెట్టుకుంది. అయితే ఆ పార్టీ రెండు పర్యాయాలు అధికారంలో ఉండడంతో స్థానిక ఎన్నికలకు వచ్చేసరికి జిల్లాలో జయకేతనం ఎగురవేసింది. ఈసారి పార్టీ అధికారం కోల్పోవడంతో స్థానిక ఎన్నికల్లో గట్టెక్కే అంశంపై నేతలు దృష్టి సారించారు. కానీ కాంగ్రెస్‌ రెండేళ్ల పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని, ఇదే తమకు కలిసొస్తుందనే ధీమా నాయకుల్లో వ్యక్తమవుతోంది. గత పంచాయతీ ఎన్నికల్లో జిల్లాలో 351 సర్పంచ్‌ స్థానాలను బీఆర్‌ఎస్‌ మద్దతుదారులు దక్కించుకున్నారు. ఆయా స్థానాల్లో మళ్లీ గెలుపుపై దృష్టి సారించడమే కాక పలు స్థానాల్లో పోటీకి సీపీఎంతో సయోధ్య కుదుర్చుకున్నట్లు తెలిసింది.

సీపీఎం, సీపీఐ, సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌, న్యూడెమోక్రసీ పార్టీలు ఈ ఎన్నికల్లో సత్తా చాటేలా కసరత్తు చేస్తున్నాయి. సీపీఎం బలం ఉన్న చోట మద్దతుదారులను బరిలోకి దింపి బీఆర్‌ఎస్‌ సహకారం కోరుతుంది. అలాగే బీఆర్‌ఎస్‌ మద్దతుదారులు పోటీచేసే పంచాయతీల్లో సీపీఎం శ్రేణులు సహకరించేలా చర్చించినట్లు తెలిసింది. సీపీఐ కూడా గతంలో తమ మద్దతుదారులు విజయం సాధించిన స్థానాల్లో పోటీని తొలి ప్రాధాన్యతగా పెట్టుకుంది. మిగతా స్థానాల్లో సీపీఎం, మరికొన్ని స్థానాల్లో కాంగ్రెస్‌తో కలిసి వెళ్లేలా స్థానిక నేతల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోనున్నట్లు సమాచారం. ఇక మాస్‌లైన్‌, న్యూడెమోక్రసీ పార్టీలు తమ ప్రభావం ఉన్న గ్రామాలపై దృష్టి పెట్టాయి.

జిల్లాలో అన్ని గ్రామపంచాయతీల్లో తమ మద్దతుదారులను బరిలో నిలపనున్నట్లు బీజేపీ ప్రకటించింది. ఎక్కువ స్థానాలు సాధించి జిల్లాలో తమ బలాన్ని నిరూపిస్తామని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, ప్రధానమంత్రి మోడీ ఛరిష్మాతో.. యువత, మహిళల ఓట్లు తమ పార్టీ మద్దతుదారులకే దక్కుతాయనే ధీమాలో ఆ పార్టీ నేతలు ఉన్నారు.

పొత్తులు.. ఎత్తులు1
1/1

పొత్తులు.. ఎత్తులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement