వైద్యుల పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు
మధిర/సత్తుపల్లిటౌన్: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో 1,200 మంది వైద్యుల పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించినట్లు వైద్యవిధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ జె.అజయ్‌కుమార్ తెలిపారు. మధిర, సత్తుపల్లి ఏరియా ప్రభుత్వ ఆస్పత్రులను గురువారం తనిఖీ చేసిన ఆయన నూతనంగా నిర్మించిన 100 పడకల ఆస్పత్రి భవనాలను పరిశీలించారు. అనంతరం అజయ్‌కుమార్ మాట్లాడుతూ మధిర, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లిలో నూతనంగా నిర్మించిన ఆస్పత్రి భవనాలను పరిశీలించామని, త్వరలోనే కొత్త భవనాలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. వైద్యులను నియమించేంత వరకు ప్రస్తుతం ఉన్న వైద్యులతో కొత్త ఆస్పత్రుల్లో ప్రజలకు సేవలు అందించాలని సూచించారు. కాగా, కమిషనర్‌ను ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయితో కలిసి మాట్లాడారు. కల్లూరులో వైద్యులు, సిబ్బంది లేకుండా నూతన భవనాన్ని ప్రారంభించొద్దని సూచించారు. ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్‌గా తాను చేసిన తీర్మానాలు అమలు చేయటం లేదని తెలిపారు. ఈకార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్ రాజశేఖర్‌గౌడ్, ఆస్పత్రుల సూపరింటెండెంట్లు కె.వెంకటేశ్వర్లు, అనిల్‌కుమార్, ఎన్.కిరణ్‌కుమార్, బి.రమేష్ తదితరులు పాల్గొన్నారు.
మేడారానికి ఆర్టీసీ బస్సులు
ఈనెల 30 నుంచి ప్రతీ ఆదివారం సర్వీసు
ఖమ్మంమయూరిసెంటర్: ములుగు జిల్లా మేడారంలో సమ్మక్క – సారలమ్మ జాతర సమీపిస్తున్న నేపథ్యాన భక్తుల కోసం ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు ఖమ్మం రీజియన్ మేనేజర్ ఏ.సరిరామ్ తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 28నుంచి జాతర జరగనుండడంతో ఈనెల 30వ తేదీ నుంచే ప్రతీ ఆదివారం ఖమ్మం నుంచి మేడారానికి బస్సు సర్వీసు అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. ఖమ్మం కొత్త బస్టాండ్ నుంచి ప్రతీ ఆదివారం ఉదయం 6గంటలకు బయలుదేరే ఎక్స్‌ప్రెస్ బస్సు, తిరిగి మేడారంలో సాయంత్రం 5.30గంటలకు మొదలవుతుందని తెలిపారు. ఖమ్మం నుండి మేడారానికి పెద్దలకై తే రూ.230, పిల్లలకు రూ.120, ఇల్లెందు నుండి పెద్దలకు రూ.170, పిల్లలకు రూ.90 చార్జీగా నిర్ణయించినట్లు ఆర్‌ఎం వెల్లడించారు.
యాప్‌లో నామినేషన్ల
వివరాలు
వైరా/కొణిజర్ల: గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా దాఖలవుతున్న నామినేషన్ల వివరాలను ఎప్పటికప్పుడు టీ పోల్ యాప్‌లో నమోదు చేయాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. వైరా మండలం పాలడుగు తదితర గ్రామాలతో పాటు తనికెళ్లలో నామినేషన్ల స్వీకరణను గురువారం ఆమె పరిశీలించి మాట్లాడారు. నామినేషన్ పత్రాలు సక్రమంగా నింపారా, అన్ని ధృవీకరణ పత్రాలు ఉన్నాయా చూశాకే స్వీకరించాలని తెలిపారు. ఇదే సమయానెలాంటి అవకతవకలకు తావు లేకుండా విధులు నిర్వర్తించాలని సూచించారు. ఎంపీడీఓలు సక్రియా, జి.వర్ష, ఎంపీఓలు రాజేశ్వరి, ఆర్.ఉపేంద్రయ్య, మండల పర్యవేక్షన అధికారి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
మీడియా సెంటర్ ప్రారంభం
ఖమ్మం సహకారనగర్: స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా కలెక్టరేట్‌లోని డీపీఆర్‌ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్(ఎంసీఎంసీ)ని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియాకు అందించాలని సూచించారు. ఎన్నికల ప్రచారంలో వీడియోలు వినియోగించాలంటే అభ్యర్థులు, నాయకుల ఎంసీఎంసీ కమిటీ వద్ద అనుమతి తీసుకోవాలని తెలిపారు. డీపీఆర్‌ఓ ఎం.ఏ.గౌస్, డీపీఓ ఆశాలత, ఏపీఆర్వో ఎండీఅయూబ్ ఖాన్‌తోపాటు ప్రవళిక, నవీన్, హరీష్, చింతల శ్రీనివాసరావు, చావా నారాయణ, తాజుద్దీన్, మంగ పాల్గొన్నారు.
వైద్యుల పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు
వైద్యుల పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు


