అభిరుచులే వ్యక్తిత్వ ప్రతిరూపాలు
● స్టాంపులు చరిత్ర, సంస్కృతికి చిహ్నాలు ● ఫిలాటికల్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన కలెక్టర్ అనుదీప్
ఖమ్మంగాంధీచౌక్: ప్రతీ వ్యక్తికి ఏదో ఒక అభిరుచి ఉంటుందని, అదే వారి వ్యక్తిత్వాన్ని బలోపేతం చేస్తుందని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. సంతోషాన్ని కలిగించే సంతృప్తికరమైన అభిరుచి అలవాటుగా మారితే వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం, జిజ్ఞాస పెరుగుతుందని పేర్కొన్నారు. ఖమ్మంలోని డీపీఆర్సీ భవనంలో తపాలా శాఖ ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన ఉమ్మడి జిల్లా స్థాయి ఫిలాటికల్ ఎగ్జిబిషన్‌ను గురువారం కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల వారు సేకరించిన ప్రత్యేక స్టాంప్‌లను ఈ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించగా ఆయన పరిశీలించి మాట్లాడారు. చిన్నతనంలో తాను కూడా పోస్టల్ స్టాంపులను సేకరించేవాడినని, తమ ప్రాంతం నుంచి ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్తే అక్కడి స్టాంపులు తీసుకుని రావాలని కోరానని గుర్తు చేసుకున్నారు. స్టాంపుల సేకరణ దేశ చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబిస్తుందని తెలిపారు. కాగా, పిల్లలు ఇలాంటి అభిరుచులు పెంచుకోవాలే తప్ప ఫోన్లకు అలవాటు పడొద్దని సూచించారు. అనంతరం పోస్టల్ బీమా పాలసీ పరిహారం చెక్కులను లబ్ధిదారులకు కలెక్టర్ అనుదీప్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం పోస్టల్ డివిజన్ సూపరింటెండెంట్ వీరభద్రస్వామి ఉద్యోగులు పాల్గొనగా మై స్టాంప్ ఫ్రేమ్‌తో కలెక్టర్‌ను సత్కరించారు. కాగా, పాఠశాలల విద్యార్థులు ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించిన వివిధ రకాల స్టాంప్‌లను తిలకించారు. అలాగే, వ్యాసరచన, స్టాంప్ డిజైన్ పోటీల్లో 450 మంది పాల్గొన్నారు. ఫిలాటెలిక్ ఎగ్జిబిషన్ శుక్రవారం సాయంత్రం 4గంటల వరకు కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
అభిరుచులే వ్యక్తిత్వ ప్రతిరూపాలు


