సర్పంచ్‌కు 100, వార్డులకు 49
● మొదలైన నామినేషన్ల స్వీకరణ ● పరిశీలించిన కలెక్టర్, అధికారులు
ఖమ్మం సహకారనగర్: జిల్లాలో తొలివిడత ఎన్నికలు జరిగే గ్రామపంచాయతీలకు నామినేషన్ల స్వీకరణ గురువారం మొదలైంది. అయితే, మొదటి రోజు తక్కువ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. శనివారం వరకు గడువు ఉండడం, ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు కాకపోవడంతో ఈ పరిస్థితి నెలకొన్నట్లు సమాచారం. ఈమేరకు ఏడు మండలాల్లోని 192 సర్పంచ్ స్థానాలు, 1,740వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా మొదటి రోజు సర్పంచ్ స్థానాలకు 100, వార్డు సభ్యుల స్థానాలకు 49నామినేషన్లు దాఖలయ్యాయని డీపీఓ, అదనపు జిల్లా ఎన్నికల అధికారి ఆశాలత తెలిపారు. కాగా, సర్పంచ్ స్థానాలకు వైరా మండలంలో అత్యధికంగా 22 నామినేషున్లు అందగా, ఎర్రుపాలెం మండలంలో కేవలం నలుగురే నామినేషన్లు సమర్పించారు. ఇక వార్డుసభ్యులుగా చింతకాని మండలంలో నామినేషన్లు దాఖలైతే ఎర్రుపాలెం మండలంలో కేవలం ఒకే నామినేషన్ దాఖలైంది.
ఏకగ్రీవం వైపు దృష్టి
చాలావరకు గ్రామపంచాయతీల్లో ఏకగ్రీవం వైపు మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. అధికార పక్షంతో పాటు ప్రతిపక్ష పార్టీల నాయకులు సైతం ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. సర్పంచ్ స్థానం అధికార పార్టీకి ఇస్తే, ప్రతిపక్ష పార్టీలకు ఉపసర్పంచ్ పదవి ఇవ్వాలని.. తద్వారా ఏకగ్రీవం చేయాలనే భావనలో ఉన్నట్లు తెలిసింది. ఈ కారణంగా ఎక్కువ మంది నామినేషన్లు దాఖలు చేయలేదని చెబుతున్నారు.
లోటుపాట్లు ఎదురుకావొద్దు
ఖమ్మం సహకారనగర్/రఘునాథపాలెం: నామినేషన్ల స్వీకరణను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పలు ప్రాంతాల్లో తనిఖీ చేశారు. రఘునాథపాలెంలో నామినేషన్ల స్వీకరణ సెంటర్‌ను పరిశీలించిన ఆయన ఉద్యోగులకు సూచనలు చేశారు. ఈ సెంటర్‌లో చింతగుర్తి, గణేశ్వరం, రఘునాథపాలెం జీపీల నామినేషన్లు స్వీకరిస్తుండగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రక్రియలో లోటుపాట్లు ఎదురుకాకుండా చూస్తూనే పారదర్శకతంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఈనెల 29వరకు ఉదయం 10–30 నుండి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించాలని తెలిపారు. తహసీల్దార్ శ్వేత, అధికారులు పాల్గొన్నారు.


