విద్యుదాఘాతంతో ఎలక్ట్రీషియన్ మృతి
చింతకాని: మండలంలోని నాగులవంచ రైల్వేకాలనీకి చెందిన ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ శెట్టిపోగు రంగయ్య (37) బుధవారం విద్యుదాఘాతంతో మృతిచెందాడు. గ్రామానికి చెందిన ఓ రైతు పొలంలో విద్యుత్ మోటార్‌కు మరమ్మతు చేస్తుండగా ఆయన షాక్‌కు గురై మృతిచెందాడు. రంగయ్యకు భార్య, కుమా రుడు, కుమార్తె ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ వీరేందర్ తెలిపారు.
ఇసుక లోడ్ ట్రాక్టర్ బోల్తా
బోనకల్: మండలంలోని బ్రాహ్మణపల్లి రేవు నుంచి అనుమతి లేకుండా వైరా మండలానికి ఇసుక తరలిస్తున్న ఓ ట్రాక్టర్‌ను బుధవారం సీజ్ చేశారు. ట్రాక్టర్‌ను తహసీల్దార్ రమాదేవి జానకీపురం క్రాస్ వద్ద గుర్తించి తహసీల్‌కు తరలిస్తుండగా ఆర్వోబీ బ్రిడ్జి దిగాక మూలమలుపు వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. అదేసమయాన రావినూతల పాఠశాల నుంచి నలుగురు ఉపాధ్యాయులతో వస్తున్న కారు.. ట్రాక్టర్ ట్రక్కుకు తాకింది. ట్రక్కు కారుపై పడకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పి.వెంకన్న తెలిపారు.
రెండు ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం
ఖమ్మంరూరల్: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి నాయుడుపేటలో రెండెకరాల ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ 136 సర్వే నంబర్‌లోని తొమ్మిది ఎకరాలకు గాను రెండు ఎకరాల భూమిని గతంలో నిరుపేదలు సాగు చేసుకునేందుకు ప్రభుత్వం పట్టాలు జారీ చేసిందని తహసీల్దార్ పి.రాంప్రసాద్ తెలిపారు. కానీ, ఇప్పటివరకు సాగు చేయకపోవడంతో ప్రభుత్వ అవసరాల కోసం తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అలాగే, భూమిలోని బోర్డులు, తాత్కాలిక ప్రహరీని తొలగించగా ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం అక్కడ ప్రభుత్వ భూమిగా చెబుతూ బోర్డు ఏర్పాటు చేశారు. ఆర్‌ఐలు ప్రసాద్, క్రాంతికుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
విద్యుదాఘాతంతో ఎలక్ట్రీషియన్ మృతి


