‘రైతుల ఆవేదనను పట్టించుకోని ప్రభుత్వం’
ఖమ్మంమామిళ్లగూడెం: అన్నం పెట్టే రైతులు ఆవేదన చెందుతుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చోద్యం చూస్తూ కాలం గడుపుతోందని మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ నాయకుడు డాక్టర్ పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ సమీపాన బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు అధ్యక్షతన బుధవారం జరిగిన రైతు దీక్షలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ సాక్షిగా ప్రమాణం చేసిన పాలకులు ఇప్పుడు రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కి పక్షపాత వైఖరిని అవలంబిస్తున్నారని ఆరోపించారు. అన్నదాతల ఉసురు పోసుకున్న ఏ ప్రభుత్వం మనుగడ సాగించలేదని, గతంలో కేసీఆర్ సర్కార్ కూడా రైతులను మోసం చేయడంతో కుప్పకూలిందని తెలిపారు. బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలకులు ప్రజాసేవ వదిలేసి రియల్ ఎస్టేట్ వ్యాపారుల అవతారమెత్తారని పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీ పేరుతో పారిశ్రామికవేత్తలకు విలువైన భూములు కట్టబెడుతూ రూ.6 లక్షల కోట్ల భారీ కుంభకోణానికి తెరలేపారని ఆరోపించారు. కిసాన్ మోర్చా నాయకుడు గోలి మధుసూదన్‌రెడ్డి మాట్లాడగా.. తొలుత అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాయకులు సన్నె ఉదయ్‌ప్రతాప్, మండడపు సుబ్బారావు, రమేశ్, నున్నా రవికుమార్, రాఘవరావు, గుత్తా వెంకటేశ్వర్లు, ప్రవీణ్‌కుమార్, రవిరాథోడ్, పెరు మాళ్ల విజయరాజు, నరుకుల వెంకటేశ్వర్లు, మంద సరస్వతి, వీరెల్లి రాజేశ్‌గుప్తా పాల్గొన్నారు.


