మిరపలో వేరుకుళ్లు ఉధృతి
ఖమ్మంవ్యవసాయం/కూసుమంచి: మిరపలో వేరుకుళ్లు తెగులు వ్యాప్తి తీవ్రంగా ఉండగా.. తామర పురుగు ఆశించడం కూడా మొదలైందని హైదరాబాద్ ఉద్యాన విశ్వ విద్యాలయం శాస్త్రవేత్తలు గుర్తించారు. విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త డాక్టర్ ప్రశాంత్, మల్యాల ఉద్యాన పరిశోధన స్థానం నుంచి డాక్టర్ భాగ్యశాలి, జిల్లా ఉద్యాన అధికారి ఎంవీ.మధుసూదన్‌తో కూడిన బృందం బుధవారం జిల్లాలో పర్యటించింది. కూసుమంచి మండలం గోపాలరావుపేట, చేగొమ్మ, లోక్యాతండా, తిరుమలాయపాలెం మండలంలోని బచ్చోడుతో పాటు బోనకల్ మండలం తూటికుంట్లలో మిరప క్షేత్రాలను పరిశీలించిన వారు తెగుళ్లను గుర్తించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ అక్టోబర్ వరకు విస్తారంగా కురిసిన వర్షాల కారణంగా వేరుకుళ్లు తెగులు వ్యాప్తి ఉందని, ఇప్పుడిప్పుడే నల్ల తామర పురుగు కూడా ఆశిస్తోందని తెలిపారు. ఈమేరకు రైతులు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలపై అవగాహన కల్పించారు. అధికారులు ముత్యాలు, అపర్ణ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పర్యటనలో గుర్తించిన శాస్త్రవేత్తలు


