తొలి సం‘గ్రామం’
● నేటి నుంచి మొదటి విడత నామినేషన్లు ● ఈ దఫా ఏడు మండలాల్లో 192 జీపీలకు ఎన్నికలు ● నామినేషన్ల స్వీకరణకు పూర్తయిన ఏర్పాట్లు ● పోటీకి సిద్ధమవుతున్న ఆశావహులు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో తొలి విడత స్థానిక సం‘గ్రామం’ మొదలుకానుంది. మొదటి దఫా ఏడు మండలాల్లో ఎన్నికలు జరగనుండగా, గురువారం నుంచి ఈనెల 29వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఉదయం 10–30నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లకు సమయం కేటాయించారు. మొదటి దశలో కొణిజర్ల, రఘునాథపాలెం, వైరా, బోనకల్, చింతకాని, మధిర, ఎర్రుపాలెం మండలాల్లోని 192 గ్రామపంచాయతీలు, 1,740 వార్డులకు ఎన్నికలు జరుగుతాయి. ఇందుకు సంబంధించి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశాలతో గ్రామపంచాయతీల్లో ఏర్పాట్లు పూర్తిచేశారు.
వచ్చేనెల 3న
అభ్యర్థుల ఖరారు
నామినేషన్లను ఈనెల 29వ తేదీ వరకు స్వీకరించాక, 30న పరిశీలన, అదేరోజు అర్హులైన అభ్యర్థుల జాబితా విడుదల చేస్తారు. ఆతర్వాత వచ్చేనెల 1న ఫిర్యాదులు స్వీకరించి, 2వ తేదీన పరిష్కరించాక 3న మధ్యాహ్నం 3గంటల వరకు ఉపసంహరణకు అవకాశం ఇస్తారు. అనంతరం బరిలో మిగిలిన అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. వచ్చే నెల 11న ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించి, అదేరోజు మధ్యాహ్నం 2గంటల తర్వాత ఓట్లు లెక్కిస్తారు. దీంతో సర్పంచ్, వార్డుసభ్యులుగా ఎవరు విజయం సాధించారో తేలాక పాలకవర్గం సమావేశం నిర్వహించి ఉపసర్పంచ్ ఎన్నిక పూర్తి చేస్తారు.
ముందైతే నామినేషన్
రిజర్వేషన్ కలిసొచ్చిన చోట పోటాపోటీగా నామినేషన్లు వేసేందుకు ఆశావహులు సిద్ధమవుతున్నారు. ఆతర్వాత బలాబలాలు బేరీజు వేసుకొని బరిలో ఉండడమా, వైదొలగడమా నిర్ణయించుకోవచ్చనే భావనలో ఉన్నారు. రాజకీయ పార్టీల గుర్తులు లేకున్నా, పార్టీల మద్దతు ఉంటేనే అభ్యర్థులకు గెలుపు సాధ్యం కానుంది. దీంతో పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుందన్నది నామినేషన్ల ఉపసంహరణ నాటికి తేలనుంది. ఈమేరకు ఆశావహులు నామినేషన్ వేసి చివరి వరకు పార్టీ మద్దతు కోసం యత్నించాలని భావిస్తున్నారు.
తొలి సం‘గ్రామం’


