నరసింహదాసుకు స్మృత్యంజలి
● ఘనంగా జయంత్యుత్సవాలు ● అలరించిన గిరి ప్రదక్షిణ
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారికి రామదాసు తర్వాత పరమ భక్తుడిగా, వాగ్గేయకారుడిగా పేరుగాంచిన శ్రీ తూము లక్ష్మీ నర్సింహదాసుకు దేవస్థానం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నీరాజనాలు పలికారు. ప్రత్యేక కార్యక్రమాలతో పాటు సంగీతోత్సవాలతో స్మృత్యంజలి ఘటించారు. ఆస్థాన విద్వాంసుల కీర్తనలు, అర్చకుల మంత్రోచ్ఛరణలు, మేళతాళాల నడుమ నరసింహదాసు చిత్రపటంతో ప్రధాన ఆలయం నుంచి ఊరేగింపుగా భద్రగిరి ప్రదక్షిణ చేశారు. అనంతరం నరసింహదాసు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి పూజలు చేశారు.
అలరించిన సంగీతోత్సవాలు..
సీతారాములకు సాయంత్రం వైభవంగా నిర్వహించే దర్బారు సేవ, పలు ప్రత్యేక పూజలను ప్రవేశపెట్టడంతో పాటు అనేక కీర్తనలు రచించి, ఆలపించిన లక్ష్మీ నర్సింహదాసుకు సంగీత, శాసీ్త్రయ నృత్యంతో నీరాజనం పలికారు. హైదరాబాద్‌కు చెందిన మహేందర్ కోలాట బృందం కళారూపాలతో పాటు స్థానాచార్యులు స్థలశాయి నర్సింహదాసు కీర్తనలు ఆలపించారు. లక్ష్మీనర్సింహదాసు వారసులు, ఆల య ఈఓ కొల్లు దామోదర్‌రావు, ఏఈఓ శ్రవణ్‌కుమార్, ప్రధాన అర్చకులు విజయరాఘవన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ‘శ్రీ రాజా తూము లక్ష్మీనర్సింహదాసు చరిత్ర’ పేరుతో రూపొందించిన గ్రంథాన్ని ఆలయ ఈఓ ఆవిష్కరించారు.
రామయ్యకు స్నపన తిరుమంజనం.
స్వామి వారి ఉత్సవమూర్తులకు బేడా మండపంలో స్నపన తిరుమంజనం గావించారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి ప్రత్యేక పూజల అనంతరం స్వామి, అమ్మవారి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
రామయ్య సన్నిధిలో ఉన్నతాధికారులు
శ్రీ సీతారామ చంద్రస్వామిని రాష్ట్ర విజిలెన్స్, ఎన్‌పోర్స్‌మెంట్ శాఖ డైరెక్టర్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, ఏ.ఆర్.శ్రీనివాసరావు, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సి.వి.ఆనంద్ బుధవారం దర్శించుకున్నారు. స్వామి దర్శనం అనంతరం వారికి పండితులు వేదాశీర్వచం చేశారు. తీర్థప్రసాదాలు అందించి ఆలయ విశిష్టతను వివరించారు. కాగా, సీ.వీ. ఆనంద్ కుమారుడు నిఖిల్‌కు భద్రాచలానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు బోగాల శ్రీనివాసరెడ్డి కుమార్తె వాసంతితో బుధవారం రాత్రి వివాహం జరగగా, వధూవరులను మంత్రి పొంగులేటి సతీమణి మాధురి, పలువురు ఎమ్మెల్యేలు ఆశీర్వదించారు.


