ఏఓలుగా గ్రూప్–1 అధికారులు
● మెడికల్ కాలేజీ, జనరల్ ఆస్పత్రికి కేటాయింపు ● ఇద్దరూ ఉమ్మడి జిల్లా వాసులే..
ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కళాశాలకు తొలిసారి ఇద్దరు గ్రూప్–1 అధికారులను కేటాయించారు. ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో ఉమ్మడి జిల్లా నుంచి ఎంపికై న వీరిని మెడికల్ కళాశాలలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు (ఏఓ)గా నియమించారు. ఇందులో ఒకరు మెడికల్ కళాశాలలో, మరొకరు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి ఏఓగా విధులు నిర్వర్తించనున్నారు.
ప్రమాదం నుంచి కోలుకుని...
మెడికల్ కాలేజీ ఏఓగా విధుల్లో చేరిన తాటి ప్రమోద్‌సాయిది భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలం తాటి సుబ్బన్నగూడెం. ఆయన తండ్రి చిన్నతనంలోనే మృతి చెందగా ప్రభుత్వ ఉపాధ్యాయురాలైన తల్లి పెంచి పెద్దచేశారు. ఇంజనీరింగ్ తర్వాత సివిల్స్ సాధించాలనే లక్ష్యంతో 2014లో ఢిల్లీ వెళ్లారు. రెండు సార్లు సివిల్స్ రాసినా ఫలితం రాలేదు. ఈక్రమంలోనే 2018లో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రమోద్ సివిల్స్ లక్ష్యాన్ని పక్కన పెట్టాల్సి వచింది. గాయాల నుంచి కోలుకోవడానికి ఐదేళ్లు పట్టగా, ఇంటి వద్దే గ్రూప్–1కు సిద్ధమయ్యారు. డిప్యూటీ కలెక్టర్ కావాలనేది లక్ష్యమైనా 317వ ర్యాంక్ రావటంతో ఏఓగా పోస్టింగ్ వచ్చిందని తెలిపారు. డీఎంఈపై పట్టు సాధించి సమర్ధవంతంగా విధులు నిర్వర్తించేలా కృషి చేస్తానని వెల్లడించారు.
సివిల్స్ లక్ష్యంతో...
తొలి నుంచి సివిల్స్ సాధించాలనే లక్ష్యంతో చదివానని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఏఓ కొప్పాక అవినాష్ తెలిపారు. ఈయన స్వస్థలం ఖమ్మం నెహ్రూనగర్ కాగా తండ్రి పంచాయితీరాజ్‌లో ఇంజనీర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. తల్లి గృహిణి. విశాఖలో ఇంజనీరింగ్ తర్వాత ఢిల్లీలో యూపీపీఎస్సీకి కోచింగ్ తీసుకుంటున్న క్రమాన గూప్–1 నోటిఫికేషన్ రావడంతో ప్రత్యేకంగా ప్రిపరేషన్ ప్రారంభించినట్లు తెలిపారు. నాలుగేళ్ల పాటు ఢిల్లీలో కోచింగ్ తీసుకోగా, గ్రూప్–1 కోసం ఖమ్మం వచ్చి సొంతంగా ప్రిపేర్ అయినట్లు వెల్లడించారు. దీంతో 506వ ర్యాంక్ సాధించగా, మెడికల్ కాలేజీ ఏఓగా పోస్టింగ్ దక్కిందని చెప్పారు. ఆస్పత్రిలోని అన్ని విభాగాలపై పట్టు సాధించి మెరుగైన సేవలు అందించేలా కృషి చేస్తానని తెలిపారు.
ఏఓలుగా గ్రూప్–1 అధికారులు


