రైట్‌.. రైట్‌ ! | - | Sakshi
Sakshi News home page

రైట్‌.. రైట్‌ !

Nov 16 2025 7:23 AM | Updated on Nov 16 2025 7:23 AM

రైట్‌.. రైట్‌ !

రైట్‌.. రైట్‌ !

వీరి సంఖ్య ఎక్కువే..

స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖలో డాక్యుమెంట్‌ రైటర్ల హవా నడుస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 11 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ శాఖలో జరిగే అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొచ్చింది. స్లాట్‌ బుకింగ్‌ విధానం, బయోమెట్రిక్‌, వినియోగదారుడే నేరుగా డాక్యుమెంట్‌ తయారు చేసుకునేలా అవగాహన కల్పించడం వంటివి చేపట్టినా ఫలితం కనిపించడం లేదు. ఈ నిబంధనలు పాటించినా డాక్యుమెంట్‌ రైటర్ల ద్వారా వెళ్తేనే రిజిస్ట్రేషన్లు త్వరగా పూర్తవుతున్నాయనే చర్చ సాగుతోంది. డాక్యుమెంట్‌ రైటర్ల కారణంగానే గతంలోనూ వైరా, ఖమ్మంరూరల్‌తో పాటు పలు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలొచ్చాయి. ఈ నేపథ్యంలో ఇటీవల సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. – సాక్షిప్రతినిధి, ఖమ్మం

వీరి డైరెక్షన్‌లోనే..

స్థిరాస్తుల నుంచి వివాహ, సొసైటీ, ఎన్జీఓ, సంఘాలు ఇతర ఎలాంటి రిజిస్ట్రేషన్లు కావాలన్నా ముందుగా డాక్యుమెంట్‌ రైటర్లనే సంప్రదించాలి. ఆ తర్వాత వ్యవహారం కూడా వీరి మార్గదర్శకత్వంలోనే సాగుతోంది. క్రయ, విక్రయాలకు సంబంధించిన దస్తావేజులు మాత్రమే రాయాల్సిన రైటర్లు.. తమకున్న పలుకుబడితో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల వద్ద మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న స్థలాలు, వెంచర్లలో ప్లాట్లను సులువుగా రిజిస్ట్రేషన్‌ చేయించేస్తున్నారు. ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా రిజిస్ట్రేషన్‌ చేసిన అధికారికి పెద్ద మొత్తంలో నగదు ముట్టజెబుతున్నట్లు తెలుస్తోంది. ఈ తరహాలో ఇటీవల వివాదాస్పద భూములకు సంబంధించి డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌ చేసిన సంగతి తెలిసిందే.

కోడ్‌ చూడు.. సంతకం పెట్టు

నిబంధనలకు విరుద్ధంగా ఉన్న స్థలాలను రిజిస్ట్రేషన్‌ చేయకూడదు. అయితే ఈ నిబంధనలేమీ డాక్యుమెంట్‌ రైటర్ల వద్ద ఉండవు. స్లాట్‌ బుక్‌ అయి రిజిస్ట్రేషన్‌ చేయాలని డాక్యుమెంట్‌ రైటర్‌ ద్వారా తమ వద్దకు తీసుకొచ్చిన దస్తావేజును అధికారులు కనీసం పరిశీలించకుండానే సంతకం పెట్టేస్తున్నారు. డాక్యుమెంట్లపై సంబంధిత రైటర్‌ కోడ్‌ వేస్తే చాలు.. అది ప్రభుత్వ భూమైనా, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నా రిజిస్ట్రేషన్‌ చేసేస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఉమ్మడి జిల్లాలో ఈ తరహా వ్యవహారం సాగుతోంది. ఇదే అదనుగా డాక్యుమెంట్‌ రైటర్లు క్రయ విక్రయదారులతో అధికారుల పేర్లు చెప్పి నేరుగా వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అపార్ట్‌మెంట్లు, ప్లాట్లు, స్థలాలకు అన్ని డాక్యుమెంట్లు సక్రమంగా ఉంటే రూ.వేలల్లో, ఏ చిన్న తేడా ఉన్నా రూ.లక్షల్లో డిమాండ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై డీఐజీ స్థాయి అధికారికి కూడా గతంలో ఫిర్యాదు చేశారు.

ఆ రెండు చోట్లే అధికం..

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 11 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలుండగా.. ఖమ్మం జిల్లాలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం గత కొన్నేళ్లుగా జోరుగా సాగుతోంది. ప్రధానంగా ఖమ్మంరూరల్‌, కూసుమంచి, వైరా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలో కొత్త వెంచర్లు అధిక సంఖ్యలో వెలవగా ఇక్కడ స్థలాల క్రయ విక్రయాలు పెరిగాయి. అదే స్థాయిలో రిజిస్ట్రేషన్లు కూడా జరుగుతున్నాయి. ఖమ్మంరూరల్‌, వైరా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలో అటు అధికారులు, ఇటు డాక్యుమెంట్‌ రైటర్లు ఇదే అదనుగా అక్రమాలకు పాల్పడుతున్నారు. వైరా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో గతేడాది డిసెంబర్‌ 28న గ్రీన్‌ల్యాండ్‌ వెంచర్లకు చెందిన వివాదాస్పద భూమికి సంబంధించి 64 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను రాత్రి 11 గంటల వరకూ ఉండి పూర్తి చేశారు. దీంతో ఆ సబ్‌ రిజిస్ట్రార్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. ఇక ఈ ఏడాది మేలో గిఫ్ట్‌ రిజిస్ట్రేషన్‌ కోసం ఖమ్మంరూరల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ ఓ డాక్యుమెంట్‌ రైటర్‌ ద్వారా లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దీంతో సదరు అధికారిణిని సస్పెండ్‌ చేశారు. రెండేళ్ల క్రితం కూడా ఖమ్మం రూరల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ప్రైవేట్‌ వ్యక్తికి ప్రభుత్వ స్థలాన్ని రిజిస్ట్రేషన్‌ చేసిన ఇన్‌చార్జ్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ అధికారిణిపై సస్పెన్షన్‌ వేటు వేశారు. ఇక తాజాగా వైరా సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో మరోసారి ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టడం, డాక్యుమెంట్‌ రైటర్లపై ఫిర్యాదులు రావడం చర్చనీయాంశంగా మారింది.

స్వయం ఉపాధి పేరుతో సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల వద్ద డాక్యుమెంట్‌ రైటర్‌ వృత్తిని ఎంచుకున్న కొందరు అక్రమ దారులు తొక్కుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలను ఆధారంగా చేసుకుని 250 మందికి పైగా డాక్యుమెంట్‌ రైటర్లు జీవనం సాగిస్తున్నారు. వారి వద్ద మరో 500 మంది వరకు పని చేస్తూ ఉపాధి పొందుతున్నారు. ఖమ్మం జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం, ఖమ్మం రూరల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ పరిధిలో 150 మంది వరకు డాక్యుమెంట్‌ రైటర్లు ఉన్నారు. కొత్తగూడెం, వైరా, కూసుమంచి కార్యాలయాల వద్ద కూడా వీరి సంఖ్య అధికంగానే ఉంది. అయితే ఇటీవల కొందరు డాక్యుమెంట్‌ రైటర్లు అదనపు ఆదాయం కోసం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులతో కుమ్మక్కై నిబంధనలకు విరుద్ధంగా స్థలాలను, స్థిరాస్తులను రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement