పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
లకారం ట్యాంక్‌బండ్‌లో చేప పిల్లల విడుదల
ఖమ్మం అర్బన్/రఘునాథపాలెం : పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం బాగుంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నగరంలోని లకారం ట్యాంక్‌బండ్‌లో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సీపీ సునీల్‌దత్‌తో కలిసి శనివారం ఆయన చేప పిల్లలు పోశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నగరంలో అంతర్గత పారిశుద్ధ్య నిర్వహణ మరింత మెరుగుపడాలని అన్నారు. లకారం చెరువు అభివృద్ధితో నగర ప్రజలకు ఆహ్లాదంగా గడిపేందుకు ఒక వేదిక దొరికిందన్నారు. వెలుగుమట్ల అర్బన్ పార్క్‌ను సైతం అభివృద్ధి చేస్తామని చెప్పారు. రోడ్ల విస్తరణకు ప్రజలు సహకరించాలని కోరారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ మత్స్యకారులకు ఉపయోగపడేలా ప్రభుత్వం 100 శాతం సబ్సిడీతో చేప పిల్లలు విడుదల చేస్తోందన్నారు. లకారం ట్యాంక్‌బండ్‌లో 82,500 చేప పిల్లలు విడుదల చేశామన్నారు. ప్రమాదవశాత్తు మృతిచెందిన మత్స్యకారుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున బీమా చెక్కులను మంత్రి తుమ్మల అందించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పి.శ్రీజ, డీసీసీబీ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వర రావు, కార్పొరేటర్ కృష్ణ, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంతరావు, జిల్లా మత్స్య శాఖ అధికారి శివప్రసాద్, జిల్లా నీటిపారుదల అధికారి వెంకట్రామ్, ఆర్డీఓ నర్సింహారావు, ఇరిగేషన్ ఈఈ అనన్య, కేఎంసీ అసిస్టెంట్ కమిషనర్ అనిల్‌కుమార్, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ సైదులు పాల్గొన్నారు.
ఆయిల్‌పామ్‌తో అధిక ఆదాయం..
ఇతర పంటలకు ప్రత్యామ్నాయంగా ఆయిల్‌పామ్ సాగు చేస్తే రైతులకు అధిక ఆదాయం వస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మంచుకొండలో నిర్మించిన రైతుబజార్‌ను శనివారం ఆయన ప్రారంభించి మహిళా రైతులతో మాట్లాడారు. తాజా ఆకుకూరలు, నాణ్యమైన కూరగాయలు పండించి నేరుగా వినియోగదారులకు సరసమైన ధరలకు విక్రయించాలని సూచించారు. మళ్లీ మంత్రిగా అవకాశం కల్పించిన ప్రజలకు మంచి పనులు చేయడం తన బాధ్యత అన్నారు. రఘునాథపాలెం మండలానికి రానున్న రోజుల్లో రూ.100 కోట్ల నిధులు తెచ్చి పంటలతో పచ్చబడేలా చర్యలు తీసుకుంటానని, ఇందుకు ప్రజలు సహకరించాలని కోరారు. తొలుత మంచుకొండ పీహెచ్‌సీలో నిర్మించిన విశ్రాంతి మందిరాన్ని తుమ్మల ప్రారంభించారు.


