నేడు ఉమ్మడి జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11.15 గంటలకు సత్తుపల్లి మండలం గౌరిగూడెం, మధ్యాహ్నం ఒంటిగంటకు భద్రాద్రి జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం హేమచంద్రాపురంలో వన సమారాధన కార్యక్రమాలకు హాజరవుతారు. 2.40 గంటలకు ఇల్లెందు మండలం సత్యనారాయణ పురం, 3 గంటలకు ఇల్లెందు ఎన్‌జీఓ కాలనీ, 3.20 గంటలకు దో నంబర్‌బస్తీలో చెరువులు, వాగులపై బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. 3.40 గంటలకు ఏరియా ఆస్పత్రిలో రక్త నిల్వ కేంద్రాన్ని, రక్తదాన శిబిరాన్ని ప్రారంభిస్తారు. సాయంత్రం 4.15 గంటలకు ఇల్లెందు ఆర్‌అండ్‌బీ కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. 4.30 గంటలకు 11వ వార్డులో డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణ స్థలాన్ని పరిశీలిస్తారు. 4.45 గంటలకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఐటీడీఏ పరిధిలో గిరిజన లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల ఆర్డర్లను పంపిణీ చేస్తారు.
శ్రీ వేంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి గాంచిన జమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో శనివారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీవారి పాదానికి, శ్రీస్వామివారి విగ్రహానికి వేదమంత్రాలతో, శాస్త్రోక్తంగా పంచామృతాభిషేకం గావించారు. ఆ తర్వాత శ్రీవారిని, శ్రీఅలివేలు మంగ, శ్రీపద్మావతి అమ్మవార్లను సుందరంగా అలంకరించి నిత్య కల్యాణం నిర్వహించగా భక్తులు తిలకించి పులకించారు. అనంతరం శ్రీవారికి అర్చకులు పల్లకీ సేవ చేశారు. కార్తీకమాసం కావడంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా హాజరై స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. కార్యక్రమంలో ఈఓ కె.జగన్మోహన్‌రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ప్రధానార్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ తదితరులు పాల్గొన్నారు.
నీలాద్రీశ్వరుడికి అన్నాభిషేకం
పెనుబల్లి : పెనుబల్లి మండలం నీలాద్రిలో గల నీలాద్రీశ్వరస్వామి ఆలయంలో కార్తీకమాసం ఏకాదశి సందర్భంగా శనివారం శివలింగానికి అన్నాభిషేకం నిర్వహించారు. ఉదయమే భక్తులు కోనేటిలో స్నామాచరించి స్వామి అభిషేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించారు.
కొనుగోళ్లలో
పారదర్శకత పాటించాలి
● డీఎస్‌ఓ చందన్‌కుమార్
కొణిజర్ల: ధాన్యం కొనుగోళ్లలో కేంద్రాల నిర్వాహకులు పారదర్శకత పాటించాలని డీఎస్‌ఓ చందన్‌కుమార్ అన్నారు. శనివారం ఆయన కొణిజర్ల, మల్లుపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. దిగుబడి ఎంత వచ్చిందని రైతులను ఆరా తీయగా గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం ఎకరాకు 10 బస్తాల మేర తగ్గిందని తెలిపారు. మల్లుపల్లిలో ధాన్యం కుప్పల్లో తేమ శాతం పరిఽశీలించిన డీఎస్‌ఓ.. తేమ సరిపడా ఉండటంతో తక్షణమే కాంటాలు వేయించాలని డ్వాక్రా మహిళలకు సూచించారు. అనంతరం కొణిజర్లలోని సీఎంఆర్ రైస్ మిల్లును తనిఖీ చేశారు. ఖరీఫ్‌లో తీసుకున్న సీఎంఆర్ తక్షణమే సరఫరా చేయాలని ఆదేశించారు. రేషన్ దుకాణంలో తనిఖీ చేసి స్టాక్ పరిశీలించారు. పోర్టబిలిటీ కార్డుదారులందరికీ బియ్యం పంపిణీ చేయాలని చెప్పారు. కార్యక్రమంలో సివిల్ సప్లై డీటీ ఎం.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
నేడు ఉమ్మడి జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
నేడు ఉమ్మడి జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన


