లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలి
ఖమ్మంమయూరిసెంటర్ : ఇందిరా మహిళా డెయిరీ నిర్వహణకు లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. కలెక్టరేట్‌లో శనివారం డెయిరీ రెండో విడత లబ్ధిదారుల ఎంపిక, నిర్వహణపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళా డెయిరీని సమర్థంగా నిర్వహించేందుకు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, మేనేజర్లుగా ఎంబీఏ అభ్యర్థులను ఔట్ సోర్సింగ్ విధానంలో నియామకానికి వీలుగా బడ్జెట్ ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు. భవిష్యత్‌లో 5 వేల మంది లబ్ధిదారులకు 2 పశువుల చొప్పున 10 వేల పశువులు పంపిణీ చేయనున్నందున తదనుగుణంగా పాల కొనుగోలు, విక్రయం వంటి పనుల పర్యవేక్షణకు సిద్ధం కావాలన్నారు. పాల వ్యాపారంలో అనుభవం ఉన్న వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని సూచించారు. పశువుల కొనుగోలులో ఎలాంటి తప్పు జరిగినా చర్యలు తప్పవని హెచ్చరించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ మాట్లాడుతూ పశువులను ఎక్కడ కొనుగోలు చేయాలి, ఏ లబ్ధిదారులకు అందించాలనే షెడ్యూల్ రూపొందించాలని సూచించారు. పశువుల ఆరోగ్య స్థితిగతులు ముందుగానే పరీక్షించాలని అన్నారు. సమావేశంలో డీఆర్‌డీఓ సన్యాసయ్య, జిల్లా పశు సంవర్థక శాఖ అధికారి శ్రీనివాసరావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నవీన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
జీవనశైలిలో మార్పులతో మధుమేహం నియంత్రణ
ఖమ్మంవైద్యవిభాగం : మానవుల జీవనశైలిలో స్వల్ప మార్పులతో మధుమేహం నియంత్రణ సాధ్యమని కలెక్టర్ అనుదీప్ అన్నారు. ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మధుమేహం సైలెంట్ కిల్లర్ వంటిదని, జాగ్రత్తలు పాటిస్తే దాని బారి నుంచి రక్షించుకోవచ్చని చెప్పారు. నిర్లక్ష్యం చేస్తే ఆ వ్యాధే శరీరంలోని అన్ని అవయవాలనూ దెబ్బ తీస్తుందని హెచ్చరించారు. ప్రతిరోజూ కనీసం అరగంట పాటు నడవాలన్నారు. రాగులు, జొన్నలు, చిరు ధాన్యాలు ఆహారంగా తీసుకుంటే మేలని చెప్పారు. డీఎంహెచ్‌ఓ రామారావు మాట్లాడుతూ మధుమేహం నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించామన్నారు. జిల్లాలో 55,829 మంది షుగర్ బాధితులను గుర్తించి ప్రతీ నెల మందులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ చందు నాయక్, డీసీహెచ్‌ఎస్ రాజశేఖర్, వైద్యాధికారులు గణేష్, సీతారాం, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి


