లోక్ అదాలత్‌తో సత్వర న్యాయం
ఖమ్మం లీగల్ : లోక్ అదాలత్ ద్వారా సమ, సత్వర న్యాయం దక్కుతుందని, లోక్ అదాలత్‌లతో కేసులు పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్ అన్నారు. న్యాయ సేవా సదన్‌లో శనివారం నిర్వహించిన ప్రత్యేక లోక్ అదాలత్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజీ పడదగిన అన్ని క్రిమినల్, చెక్ బౌన్స్, మోటార్, ప్రమాద బీమా కేసులు అధిక సంఖ్యలో పరిష్కరించామని తెలిపారు. న్యాయ సేవాధికారి సంస్థ ద్వారా ప్రీ లిటిగేషన్ కేసులు పరిష్కరించామన్నారు. లోక్ అదాలత్‌తో రాజీ చేసుకోవడం ద్వారా కక్షిదారులకు సమయం, డబ్బు ఆదా అవుతాయన్నారు. కక్షిదారులు రాజీ పడడం ద్వారా ఇరుపక్షాలు గెలుపొందే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ వి. ఆర్.కృష్ణయ్యర్ అన్న మాటలను గుర్తు చేస్తూ కక్షిదారులను లీగల్ పేషెంట్లుగా అభివర్ణించారు. ప్రత్యేక లోక్ అదాలత్‌లకు సహకరించిన బీమా కంపెనీలు, పోలీసులను అభినందించారు.
రోడ్డు ప్రమాద బాధితుడికి రూ.24 లక్షలు రివార్డు..
ఓ రోడ్డు ప్రమాదంలో బోడా నరేష్ ఎడమ కాలు కోల్పోయి శాశ్వత అంగవైకల్యం ఏర్పడింది. దీంతో అతడు పరిహారం కోసం కోర్టులో కేసు దాఖలు చేయగా ఇరుపక్షాల న్యాయవాదులతో, బజాజ్ అలియాంజ్ ఇన్సూరెన్స్ కంపెనీతో మాట్లాడి కేసు రాజీ చేయగా.. బాధితునికి నష్టపరిహారంగా రూ.24.50లక్షలు ఇవ్వడానికి బీమా కంపెనీ అంగీకరించింది. ఈ మొత్తాన్ని బాధితుడికి లోక్ అదాలత్‌లో జడ్జి చేతుల మీదుగా అందించారు. న్యాయ సేవాధికార సంస్థ ఇన్‌చార్జ్ కార్యదర్శి ఎం.కల్పన అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు రాంప్రసాదరావు, అర్చనకుమారి, శివరంజని, మురళీమోహన్, దీప, రజిని, బిందుప్రియ, మాధవి, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
4,635 కేసుల పరిష్కారం..
ప్రత్యేక లోక్ అదాలత్‌లో మొత్తం 4,635 కేసులు పరిష్కారం అయ్యాయి. వీటిలో క్రిమినల్ కేసులు 596, ఈ పెట్టి కేసులు 2,350, చెక్ బౌన్స్ కేసులు 53, ఇతర కేసులు 1,636 ఉన్నాయి.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాజగోపాల్


