ఉత్తమ బోధన.. ఉన్నత స్థానం
విద్యార్థుల అభివృద్ధే లక్ష్యం
పీటీఎం, ఎఫ్‌ఆర్‌ఎస్‌ల్లో జిల్లా టాప్
విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిపై
చర్య తప్పదు
‘సాక్షి’తో డీఈఓ చైతన్య జైనీ
ఖమ్మం సహకారనగర్ : ప్రతీ విద్యార్థికి నాణ్యమైన బోధన అందాలని, ప్రభుత్వ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో అందరి పాత్రా కీలకమని డీఈఓ చైతన్య జైనీ అన్నారు. పీటీఎం(పేరెంట్ టీచర్ మీటింగ్), ఎఫ్‌ఆర్‌ఎస్(ఫేస్ రికగ్నేషన్ సిస్టమ్)లో రాష్ట్రంలోనే జిల్లా అగ్రస్థానంలో ఉందని తెలిపారు. విద్యార్థులకు ఉత్తమ బోధన ద్వారా ఉన్నత స్థానాలకు తీసుకెళ్లే కృషిలో కీలక భూమిక పోషిస్తానని చెప్పారు. జిల్లా విద్యాశాఖాధికారిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన చైతన్య జైనీ.. శనివారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలు వెల్లడించారు. వివరాలు ఆమె మాటల్లోనే..
1000 పాఠశాలల్లో పీటీఎం..
పీటీఎం నిర్వహణలో జిల్లా ముందంజలో ఉంది. గతంలో 400 నుంచి 430 పాఠశాలల్లో పీటీఎంలు నిర్వహించి యాప్‌లో అప్‌లోడ్ చేసేవారు. తాజాగా(శుక్రవారం) 1,230 పాఠశాలలకు గాను 1000 స్కూళ్లలో పీటీఎం నిర్వహణకు సంబంధించిన వివరాలు యాప్‌లో ఆన్‌లైన్ చేశారు. ఎఫ్‌ఆర్‌ఎస్‌లో కూడా జిల్లాలో ప్రస్తుతం 75 శాతం మేర హాజరు నమోదవుతోంది. దీన్ని నూరు శాతానికి పెంచేలా సమీక్ష చేస్తాం. ఎఫ్‌ఆర్‌ఎస్ విషయంలో తప్పిదాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఈ క్రమంలో మానిటరింగ్‌ను పెంచుతున్నాం. సీఎంఓ, ఏఎంఓ, సెక్టోరల్ అధికారులు ఎవరైనా పాఠశాలల తనిఖీలకు వెళ్లినప్పుడు ప్రతీ అంశాన్ని పరిశీలించి నివేదిస్తారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే ఉపాధ్యాయులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం.
నిత్యం సమీక్షలు..
జిల్లాలో ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తాం. నిత్యం సమీక్షలు, సమావేశాలు నిర్వహించి ప్రతీ విద్యార్థికి చదవడం, రాయటం నేర్పించే ప్రయత్నం చేస్తా. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశాలు అమలు చేస్తూ టాప్‌లో నిలిచేలా చర్యలు తీసుకుంటా. విద్యాశాఖకు సంబంధించిన అంశాలపై ప్రతి రోజూ జూమ్ మీటింగ్ ద్వారా సమీక్ష చేస్తా.
నూరు శాతం ఫలితాలు సాధించేలా..
పదో తరగతిలో నూరు శాతం ఫలితాలు సాధించేలా ప్రణాళికాయుతంగా ముందుకెళ్తాం. ఇప్పటికే విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. వెనుకబడిన వారిని గుర్తించి వారిపై ప్రత్యేక దృష్టి సారించి నూరుశాతం ఫలితాలు వచ్చేలా పని చేస్తాం. ప్రత్యేక తరగతుల్లో విద్యార్థులకు అల్పాహారం అందించేందుకు దాతల సహకారం తీసుకుంటున్నాం. విధుల్లో నిర్లక్ష్యం వహించే ఉపాధ్యాయులు, అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం. ప్రతీ విద్యార్థికి నాణ్యమైన బోధన అందించాలనే లక్ష్య సాధనలో నా పాత్ర కీలకంగా ఉంటుంది. డీఈఓ కార్యాలయంతో పాటు క్షేత్రస్థాయిలో అన్ని అంశాలను పరిశీలిస్తా.
ఉత్తమ బోధన.. ఉన్నత స్థానం


