 
															మున్నేటి పరీవాహకంలో అలర్ట్
● రాత్రి 11 గంటలకు  20 అడుగుల మేర వరద ● లోతట్టు ప్రాంతాల ప్రజలను  ఖాళీ చేయించిన అధికారులు ● పలుచోట్ల పునరావాస కేంద్రాల ఏర్పాటు, ఉద్యోగుల పర్యవేక్షణ
ఖమ్మంమయూరిసెంటర్: జిల్లా కేంద్రంతో పాటు ఎగువన మున్నేరు పరీవాహకంలో భారీ వర్షం కురవడంతో మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఖమ్మం కాల్వొడ్డు వద్ద బుధవారం మధ్యాహ్నం 12గంటలకు 10 అడుగుల మేర మాత్రమే ప్రవహించిన వరద సాయంత్రం 5గంటల వరకు 18 అడుగులకు చేరింది. ఐదు గంటల్లో దాదాపు ఎనిమిది అడుగుల మేర వరద పెరగడంతో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మున్నేటికి ఇరువైపులా ప్రజలను అప్రమత్తం చేయించారు. ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో పాటు లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించాలని తెలిపారు. కలెక్టర్, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య మున్నేటిని పరిశీలించాక ధంసలాపురం పాఠశాల, నయాబజార్ కళాశాలలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయించారు. అంతేకాక పలు కాలనీల ప్రజలను పునరావాస కేంద్రాలకు వాహనాల్లో తరలించారు. రాత్రి 11గంటలకు కాల్వొడ్డు వద్ద మున్నేటి వరద 20అడుగులకు చేరింది. ఆపై నెమ్మదిగా పెరుగు తుండడంతో అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
కుండపోత వర్షం
మోంథా తుపాన్ ప్రభావంతో నగరంలో కుండపోత వర్షం కురిసింది. మంగళవారం రాత్రి నుండి బుధవారం ఉదయం 8–30 గంటల వరకు 5.2 సెం.మీ., బుధవారం ఉదయం 8–30 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు 3.3 సెం.మీ. వర్షపాతం నమోదైంది. దీంతో పలు చోట్ల రోడ్లపైకి నీరు చేరగా వాహనదారులు ఇబ్బంది పడ్డారు. రాపర్తినగర్ వద్ద మేయర్ పునుకొల్లు నీరజ, కమిషనర్ అభిషేక్ అగస్త్య, కార్పొరేటర్ రాపర్తి శరత్‌కుమార్ జేసీబీతో కాల్వ తీయించి నీరు వెళ్లేలా చర్యలు చేపట్టారు. అలాగే, రాపర్తినగర్ బైపాస్, డిపో రోడ్డులో, చెరువుకట్ట ప్రాంతంలో ఇళ్ల వద్దకు నీరు చేరగా డ్రెయినేజీల్లో అడ్డుపడిన వ్యర్థాలను తొలగించడంతో నీరు సాఫీగా సాగింది.
అధికారులంతా అక్కడే..
మున్నేటి వరద ప్రమాదకర స్థాయిలో ఉండడంతో కలెక్టర్ అనుదీప్, మేయర్ పి.నీరజ, కమిషనర్ అభిషేక్ సహా అధికారులంతా పరీవాహకంలో ప్రజలను అప్రమత్తం చేశారు. ఏ క్షణమైనా ఇళ్లను ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుందని చెప్పడంతో స్థానికులు సామగ్రి సర్దుకున్నారు. ఇక బొక్కల గడ్డ, గంగాభవాని గుడి, ధంసలాపురం ప్రాంతంలోని పలు ఇళ్లను ఖాళీ చేయించి నయాబజార్ కళాశాల పునరావాస కేంద్రానికి తరలించారు. అలాగే, రెండు కేంద్రాల్లో వేయి మందికి సరిపడా భోజనం సిద్ధం చేశారు. కమిషనర్ అభిషేక్ నయాబజార్ కేంద్రాన్ని పరిశీలించి ఏర్పాట్లపై సూచనలు చేశారు. డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్, ఏఎంసీ అనిల్‌కుమార్, ఈఈ కృష్ణాలాల్, డీఈఈలు నవ్యజ్యోతి, ధరణికుమార్, శ్రీనివాస్‌తో పాటు ఏఈఈలు కూడా పర్యవేక్షించారు.
 
							మున్నేటి పరీవాహకంలో అలర్ట్

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
