 
															కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
● అత్యవసర సమయాన 1077, 90632 11298కు ఫోన్ చేయొచ్చు.. ● మున్నేటి పరీవాహకంలో  పర్యటించిన కలెక్టర్ అనుదీప్
ఖమ్మంమయూరిసెంటర్/ఖమ్మం రూరల్: ఎగువ ప్రాంతాల నుండి వచ్చే వరదతో మున్నేటి ప్రవాహం పెరుగుతున్న నేపథ్యాన అన్ని శాఖల ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. ఇదే సమయాన ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటూ అత్యవసర సమయాల్లో కలెక్టరేట్‌లోని కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఖమ్మం కార్పొరేషన్, ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం మున్సిపాలిటీలోని మున్నేటి పరీవాహక ప్రాంతాలైన కాల్వొడ్డు, మున్నేరు ఘాట్, గణేష్ నిమజ్జన ఘాట్, బొక్కలగడ్డ, జలగంనగర్, కేబీఆర్ నగర్, గ్రీన్ కాకతీయనగర్ తదితర ప్రాంతాల్లో కేఎంసీ, ఏదులాపురం కమిషనర్లు అభిషేక్ ఆగస్త్య, శ్రీనివాసరెడ్డితో కలిసి కలెక్టర్ పర్యటించారు. పలు కాలనీల ప్రజలతో మాట్లాడిన ఆయన వరద పెరుగుతున్న నేపథ్యాన అధికారులకు సహకరించాలని, ఎప్పుడు చెప్పినా పునరావాస కేంద్రాలకు వెళ్లేలా సిద్ధంగా ఉండాలని తెలిపారు. కాగా, నీటిపారుదల, రెవెన్యూ, పంచాయతీ, మున్సిపల్, పోలీస్ శాఖల అధికారులు క్షేత్రస్ధాయిలో ఎప్పటికప్పుడు నీటిమట్టం అంచనా వేస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కేఎంసీ సహాయ కమిషనర్ అనిల్‌కుమార్, ఆర్‌డీఓ నర్సింహారావు, ఖమ్మం అర్బన్, రూరల్ తహసీల్దార్లు సైదులు, పి.రాంప్రసాద్, మున్సిపల్, పోలీస్, ఇరిగేషన్ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
కొణిజర్ల: తుపాన్‌తో భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అనుదీప్ సూచించారు. కొణిజర్ల మండలంలోని తుమ్మలపల్లి, అన్నవరం మధ్య పొంగి ప్రవహిస్తున్న పగిడేరు వాగును పరిశీలించాక మండలంలో వర్షాలు, వాగుల్లో ఉధృతిపై తహసీల్దార్ ఎన్.అరుణ, ఉద్యోగులతో చర్చించారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
