వర్షంతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం | - | Sakshi
Sakshi News home page

వర్షంతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం

Oct 30 2025 9:26 AM | Updated on Oct 30 2025 9:26 AM

వర్షం

వర్షంతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం

సత్తుపల్లిరూరల్‌: తుపాన్‌ ప్రభావంతో మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు సత్తుపల్లి జేవీఆర్‌, కిష్టారం ఓసీల్లో బొగ్గు ఉత్పత్తి, మట్టి వెలికితీతకు ఆటంకం ఏర్పడింది. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో ఓసీల్లోకీ నీరు చేరింది. దీంతో రెండు ఓసీల్లో 2లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి తొలగింపు, 35వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయిందని పీఓలు ప్రహ్లాద్‌, నర్సింహారావు తెలిపారు. ఈమేరకు భారీ మోటార్ల సాయంతో నీటి తొలగింపు పనులు ముమ్మరం చేశారు.

ఖమ్మం మార్కెట్‌కు

సెలవుల పొడిగింపు

ఖమంవ్యవసాయం: ‘మోంథా’ తుపాను కారణంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవులను పొడిగించారు. తొలుత బుధవారం వరకు సెలవు ప్రకటించగా.. తుపాన్‌ తీవ్రత నేపథ్యాన శుక్రవారం(31వ తేదీ) వరకు సెలవులు కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆపై నవంబర్‌ 1న శనివారం, 2న ఆదివారం వారాంతపు సెలవులు కావడంతో నవంబర్‌ 3వ తేదీ సోమవారం నుంచి పంట కొనుగోళ్లు మొదలవుతాయని మార్కెట్‌ ఉన్నత శ్రేణి కార్యదర్శి పి.ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. ఈ విషయాన్ని రైతులు, వ్యాపారులు, కార్మికులు గమనించాలని సూచించారు.

పలు రూట్లలో బస్సుల రద్దు

ఖమ్మంమయూరిసెంటర్‌: తుపాను ప్రభావంతో ఖమ్మం రీజియన్‌ పరిధిలో పలు మార్గాలకు ఆర్టీసీ బస్సులను రద్దు చేశారు. రీజియన్‌ పరిధి ఏడు డిపోల నుంచి 128 బస్సులను రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. పలుచోట్ల రహదారులపైకి వరద చేరడంతో ముందు జాగ్రత్తగా ఖమ్మం నుంచి మహబూబాబాద్‌, వరంగల్‌ రూట్లలో బస్సులు నడిపించలేదు. ఖమ్మంతోపాటు మధిర, సత్తుపల్లి, భద్రాచలం, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు డిపోల నుంచి వివిధ మార్గాల్లో బుధవారం ఒకేరోజు 60,872 కి.మీ. మేర సర్వీసులు రద్దయ్యాయి. అత్యధికంగా సత్తుపల్లి డిపో నుంచి 35, భద్రాచలం డిపో నుంచి 25, ఖమ్మం నుంచి 22, కొత్తగూడెం నుంచి 15, ఇల్లెందు నుంచి 11, మధిర, మణుగూరు నుంచి పదేసి సర్వీసులను రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

జలాశయాల్లో

పెరుగుతున్న నీటిమట్టం

ఖమ్మంఅర్బన్‌: తుపాను ప్రభావంతో జిల్లాలోనే కాక సమీప జిల్లాల్లో వర్షాలు కురుస్తుండగా ప్రధాన జలాశయాలు, వాగుల్లో నీటిమట్టం పెరుగుతోంది. పాలేరు, వైరా, లంకసాగర్‌ ప్రాజెక్టుల్లో నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరగా, ఆకేరు, మున్నేరు వాగుల్లోనూ నీటి ప్రవాహం గణనీయంగా పెరుగుతోంది. పొలిశెట్టిగూడెం, తీర్థాల వద్ద మున్నేటిలో నీటిమట్టం వేగంగా పెరుగుతోందని జల వనరుల శాఖ అధికారులు తెలిపారు. కాగా, జిల్లాలోని మొత్తం 1,061 చెరువులకు 629 చెరువులు 90శాతానికి పైగా మేర నిండగా, 213 చెరువులు పూర్తిగా నిండడంతో అలుగుపోస్తున్నాయని తెలిపారు. అంతేకాక మరో ఐదు చెరువులు 25–50 శాతం, 54 చెరువుల్లో 50–75 శాతం, 157 చెరువుల్లో 75–90 శాతం మేర నీరు చేరిందని పేర్కొన్నా రు. వర్షం కొనసాగితే జలాశయాల్లోకి మరింత వరద చేరనున్నందున పరీవాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

డీఈఈటీ ద్వారా

ఉపాధి అవకాశాలు

ఖమ్మంమయూరిసెంటర్‌: గిరిజన నిరుద్యోగ యువతీ, యువకులు డీఈఈటీ వేదికను వినియోగించుకోవాలని జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారి ఎన్‌.విజయలక్ష్మి సూచించారు. తెలంగాణ డిజిటల్‌ ఎంప్లాయిమెంట్‌ ఎక్స్ఛేంజ్‌(డీఈఈటీ) ద్వారా వివరాలు నమోదు చేసుకుంటే అర్హత ఆధారంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తారని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న గిరిజన నిరుద్యోగులు https://deet. telangana.gov.in ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు.

ఐదుగురు ఉపాధ్యాయుల డిప్యుటేషన్లు రద్దు

ఖమ్మం సహకారనగర్‌: జిల్లాలోని వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల్లో నలుగురిని డీఈఓ కార్యాలయానికి, వయోజన విద్యాశాఖకు ఒకరిని డిప్యుటేషన్‌పై ఇటీవల కేటాయించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వారిని డిప్యుటేషన్‌ చేసి బాధ్యతలు అప్పగించడంపై విమర్శలు వచ్చాయి. దీంతో ఐదుగురు ఉపాధ్యాయులను యథాస్థానాలకు కేటాయిస్తూ అదనపు కలెక్టర్‌, డీఈఓ శ్రీజ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

వర్షంతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం
1
1/1

వర్షంతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement