పత్తి విక్రయాలపై వాన దెబ్బ
● ఇదే అదునుగా వ్యాపారుల దగా ● తేమ, నాణ్యత పేరిట ధర తక్కువగా నిర్ణయం
ఖమ్మంవ్యవసాయం: పత్తి విక్రయాలకు మెంథా తుపాన్ ఆటంకంగా మారింది. దీంతో ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు మంగళవారం పంట తీసుకొచ్చిన రైతులు ఇబ్బంది పడ్డారు. కొందరు రైతులు షెడ్లలో, ఇంకొందరు యార్డు ఆరు బయట బస్తాలు దింపగా... వర్షం నుంచి రక్షించుకునేందుకు టార్పాలిన్లు కప్పారు. అయినా కొందరు రైతుల పత్తి తడిసింది. అయితే, రైతుల ఇక్కట్లను ఆసరాగా చేసుకున్న కొందరు వ్యాపారులు తేమ పేరిట దగా చేయడం గమనార్హం.
మద్దతు ధరే లేదు...
కేంద్రం ప్రకటించిన మద్దతు ధరతో పొంతన లేకుండా వ్యాపారులు ఇష్టారాజ్యంగా కొనుగోళ్లు చేశారు. ఈ ఏడాది కేంద్రం పత్తి క్వింటాకు గరిష్టంగా రూ.8,110 ధర నిర్ణయించింది. కానీ వ్యాపారులు రూ.7వేలకు మించి చెల్లించడం లేదు. ఇప్పుడు తుపాన్ నేపథ్యాన మరికొంత కోత పెట్టారు. ఇదేమిటని అడిగితే పత్తిలో తేమ శాతం ఎక్కువగా ఉందని చెప్పినా.. ఎక్కడా యంత్రాలతో పరీక్షించలేదు. ఖమ్మం మార్కెట్‌లో మంగళవారం మోడల్ ధర రూ.6,500గా పకలడంతో కేంద్రం నిర్ణయించిన ధరతో పోలిస్తే క్వింటాకు రూ.1,610 మేర రైతులు నష్టపోయారు. ఇక సీసీఐ కేంద్రాలకు తీసుకెళ్లినా తేమ శాతం అడ్డంకిగా నిలుస్తుండడంతో రైతులు చేసేదేం లేక వచ్చిన ధరకు అమ్ముకుని ఇంటిముఖం పట్టారు. అసలే ఈ ఏడాది దిగుబడి లేకపోగా, ఇప్పుడు ధర కూడా దక్కకపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు.
పత్తి విక్రయాలపై వాన దెబ్బ


