గ్రామీణులే లక్ష్యంగా మోసాలు
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి....
● పంజా విసురుతున్న సైబర్ నేరగాళ్లు ● ప్రభుత్వ పథకాల పేరిట రూ.లక్షల్లో స్వాహా ● భారీగా నష్టపోతున్న జిల్లా ప్రజలు
ఖమ్మంక్రైం: ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వాడని వారెవరూ కనిపించడం లేదు. అందరి చేతుల్లో ఇంటర్నెట్‌తో కూడిన ఫోన్ ఉండడమే కాక గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సైతం నిత్యావసర వస్తువుగా మారింది. దీన్ని ఆసరాగా చేసుకున్న సైబర్ నేరగాళ్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల పేరిట నమ్మిస్తూ నగదు స్వాహా చేస్తున్నారు. ఇన్నాళ్లు ఈ మోసాలకు పట్టణ వాసులే బలికాగా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోనూ కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. బ్యాంకు అధికారులు, ప్రభుత్వ ఉద్యోగాల మాదిరి ఫోన్ చేయడం.. రుణాలు, ప్రభుత్వ పథకాలు మంజూరు చేయిస్తామని నమ్మబలికి లింక్‌లు పంపిస్తున్నారు. అవి ఓపెన్ చేయగానే ఖాతాలోని నగదు మాయమవుతోంది. ఈనేపథ్యాన పోలీసులు గ్రామీణ ప్రాంతాల్లోనూ విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకతను ఇటీవల జరుగుతున్న ఘటనలు తెలియచేస్తున్నాయి.
258 కేసులు, రూ.12.80కోట్లు
ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు నగదు మోసాలపై జిల్లాలో 258 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో బాధితులు రూ.12.80కోట్ల మేర నగదు కోల్పోయారు. ఇందులో రూ.3.60కోట్ల మేర పోలీసులు, సైబర్ క్రైం పోలీసులు రికవరీ చేసినా మిగతా నగదు వస్తుందా, రాదా అన్న సంశయం నెలకొంది.
● సత్తుపల్లికి చెందిన ఓ కిరాణం వ్యాపారికి బ్యాంక్ మేనేజర్‌గా చెబుతూ వీడియో కాల్ చేసిన వ్యక్తి కేంద్ర ప్రభుత్వం నుంచి రుణం మంజూరైందని నమ్మించాడు. అకౌంట్‌లో నగదు జమ చేసేందుకు ఓటీపీ చెప్పాలని సూచించడంతో సదరు చిరు వ్యాపారి ఓటీపీతో పాటు ఖాతా వివరాలు చెప్పగానే అకౌంట్‌లో రూ.70వేలు విత్‌డ్రా అయ్యాయని మెసేజ్ వచ్చింది.
● మధిర మండలంలోని ఓ గ్రామ రైతుకు ఫోన్ చేసిన వ్యక్తి పాల వ్యాపారానికి తక్కువ వడ్డీతో బ్యాంకు ద్వారా రుణం ఇస్తామని చెప్పాడు. వీడియో కాల్ చేసిన వ్యక్తి మెడలో గుర్తింఉ కూడా ఉండడంతో నమ్మిన రైతు తన బ్యాంక్ ఖాతాపుస్తకం ఫొటోను వాట్సాప్ చేశాడు. సరిగ్గా పది నిమిషాల్లో ఆయన ఖాతా నుంచి రూ.లక్ష డ్రా అయినట్లు మెసేజ్ అందింది.
● రఘునాథపాలెం మండలానికి చెందిన ఒక రైతుకు పీఎం కిసాన్ పేరిట ఫోన్‌కు మెసేజ్ రూపంలో లింక్ రాగా ఓపెన్ చేయటంతో ఖాతా నుంచి రూ.50వేలు, అదే మండలంలోని ఇంకో రైతు ఖాతా నుంచి రూ.82వేలను సైబర్ నేరగాళ్లు మాయం చేశారు.
సైబర్ నేరగాళ్ల రకరకాలుగా మోసాలకు పాల్పడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల పేరిట లింక్‌లు పంపించడం, బ్యాంక్ ఖాతా, ఓటీపీ చెప్పాలని అడిగి క్షణాల్లో నగదు స్వాహా చేస్తున్నారు. అంతేకాక డిజిటల్ అరెస్ట్ పేరిట పోలీసు యూనిఫామ్‌లో ఉండి ఫోన్లు చేస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు ఎవరు ఫోన్ చేసినా ప్రజలు స్పందించొద్దు. బ్యాంకు, ప్రభుత్వ శాఖల అధికారులు ఫోన్ చేసి వ్యక్తిగత వివరాలు అడగరు. ఈ విషయాన్ని గుర్తించి అప్రమత్తంగా ఉండాలి. అంతేకాక సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయినట్లు గుర్తిస్తే మొదటి గంటలో పోలీసులకు సమాచారం ఇస్తే నగదు రికవరీకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి.
– ఫణీందర్, సైబర్ క్రైం డీఎస్పీ


