వైరా: వైరా మున్సిపాలిటీ శివారు గండగలపాడులో పశువులకు గాలికుంటు వ్యాఽధి నివారణ టీకాలు వేసే కార్యక్రమాన్ని జిల్లా పశు వైద్యాధికారి బోడేపూడి శ్రీనివాసరావు మంగళవారం పరిశీలించారు. మండల వ్యాప్తంగా ఎన్ని పశులకు టీకాలు వేశారు, ఇంకా ఎన్నింటికి వేయాలనే అంశాన్ని రికార్డుల ఆధారంగా ఆరా తీశారు. గాలికుంటు వ్యాధి సోకితే పశువుల్లో పాలదిగుబడి తగ్గిపోతుందనే అంశంపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. మండల పశు వైద్యాధికారి రాకేష్‌కుమార్, ఉద్యోగులు కృష్ణకుమార్, సురేష్, రామలింగస్వామి, రాము, చుక్కారావు, రవీందర్, ఐవీ.ప్రకాశ్, గోపాలమిత్రలు పాల్గొన్నారు
కోతుల గుంపు దాడితో ఆటో బోల్తా
కల్లూరురూరల్: మండలంలోని ముగ్గు వెంకటాపురం శివారులో కోతుల గుంపు ఒక్కసారి రావడంతో అదుపు తప్పిన ఆటో బోల్తా పడింది. కుర్నవల్లి నుంచి ముత్తగూడెం వైపు మంగళవారం వెళ్తున్న ఆటో ముగ్గవెంకటాపురం శివార్లలోకి రాగానే రహదారి పక్కన ఉన్న కోతుల గుంపు ఆటోపైకి వచ్చింది. దీంతో డ్రైవర్ ఆందోళన చెందగా ఆటో అదుపు తప్పి పల్టీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలు కాగా స్థానికులు ముత్తగూడెం ఆస్పత్రికి తరలించారు.
ఐదు ఇసుక లారీలు సీజ్
ఖమ్మంక్రైం: ఖమ్మంలో అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న ఐదు లారీలను మంగళవారం రాత్రి త్రీటౌన్ పోలీసులు సీజ్ చేశారు. ప్రకాష్‌నగర్ బ్రిడ్జి వద్ద సీఐ మోహన్‌బాబు ఆధ్వర్యాన తనిఖీ చేస్తుండగా లారీలు పట్టుబడ్డాయి. ఈమేరకు లారీలను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాల్లో చోరీ
సత్తుపల్లిరూరల్: సత్తుపల్లి మండలం ప్రకాష్‌నగర్ కాలనీలోని ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాల్లో సోమవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు భవనాల తాళాలు, తలుపులు పగులగొట్టి లోపలికి చొరబడ్డారు. మంగళవారం ఉదయం ఈ విషయాన్ని ఉపాధ్యాయులు గుర్తించారు. పాఠశాలలోని బీరువాలను పగులగొట్టగా, అంగన్‌వాడీ కేంద్రంలో పాల పాకెట్లు, నూనె, బాలామృతం ప్యాకెట్లు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులు సమాచారం ఇవ్వగా వారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
అనారోగ్యంతో యువకుడి ఆత్మహత్య
తిరుమలాయపాలెం: కడుపునొప్పి తాళలేక ఓ యువకుడు గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మండలంలోని రఘునాథపాలెంకు చెందిన గౌని లింగరాజు(28) తల్లి అచ్చమ్మ వద్ద ఉంటూ కూలీ పనులతో జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు కడుపునొప్పితో బాధపడుతూ చికిత్స చేయించుకున్నా తగ్గకపోవడంతో సోమవారం గడ్డి మందు తాగాడు. దీంతో లింగరాజును ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా మృతి చెందడంతో, ఆయన కుటుంబీకుల పిర్యాదు మేరకు పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు.
పశువుల వ్యాక్సినేషన్ పరిశీలన


