రెండోరోజు 44 నామినేషన్ల దాఖలు
ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మం చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ మంగళవారం రెండో రోజుకు చేరింది. ఈ సందర్భంగా44 నామినేషన్లు దాఖలయ్యాయి. కురువెళ్ల–గొడవర్తి ప్యానల్ అభ్యర్థులు మద్దతుదారులతో కలిసి ర్యాలీకి వర్తక సంఘం భవనానికి చేరుకున్నారు. అధ్యక్ష పదవికి కురువెళ్ల ప్రవీణ్‌కుమార్, ప్రధాన కార్యదర్శిగా గొడవర్తి శ్రీనివాసరావు, ఉపాధ్యక్ష పదవికి కురువెళ్ల కాంతారావు, సహాయ కార్యదర్శి పదవికి బాదె రవి, కోశాధికారిగా తూములూరి లక్ష్మీనరసింహారావుతో పాటు మిర్చి, వెండి, బంగారం శాఖ పదవులకు బండారు వీరబాబు, చింతల రామలింగేశ్వరరావు, విజయగిరి సదానందచారి, బూర్లె లక్ష్మీనారాయణ నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే, అధ్యక్ష పదవికి కొప్పుల కోటేశ్వరరావు స్వతంత్య్ర అభ్యర్థిగా నామినేషన్ సమర్పించారు. కురువెళ్ల– గొడవర్తి ప్యానెల్‌కు ప్రస్తుత అధ్యక్షుడు చిన్ని కృష్ణారావు, గుర్రం ఉమామహేశ్వరరావు, చెరుకూరి కృష్ణమూర్తి, వేములపల్లి వెంకటేశ్వరరావు, మాజీ అధ్యక్షులు కొప్పు నరేష్ తదితరులు మద్దతు తెలిపారు. తొలిరోజు 37, రెండో రోజు 44 కలిపి 81 నామినేషన్లు దాఖలు కాగా, బుధవారంతో గడువు ముగియనుందని ఎన్నికల అధికారి పీబీ.శ్రీరాములు తెలిపారు. ఆపై గురువారం పరిశీలించి, శుక్రవారం ఉపసంహరణ గడువు ముగిశాక బరిలో మిగిలిన అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు.
ఎన్నికల్లో నా జోక్యం లేదు
ఖమ్మంఅర్బన్: చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో ప్రచారానికి కొందరు తన పేరు ఉపయోగిస్తుండడంపై రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడు కూడా తాను యూనియన్లు, సంఘాల ఎన్నికల్లో జోక్యం చేసుకోలేదని, ఇప్పుడు కూడా అదే వైఖరి ఉంటుందని స్పష్టం చేశారు. చాంబర్ ఎన్నికల్లో ఎవరికీ తాను మద్దతు తెలపలేదనే విషయాన్ని గుర్తించాలని మంత్రి ఓ ప్రకటనలో సూచించారు.


