
ఉత్తమ ఫలితాలను సాధిద్దాం..
ఖమ్మం సహకారనగర్: ప్రతీ విద్యార్థికి ప్రాథమిక స్థాయిలోనే ఇంగ్లిష్ సామర్థ్యాలు పెంచేలా ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమం అమలు చేస్తున్నామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలో నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్, అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్‌లో ఇబ్బంది పడకుండా ఆంగ్లంపై పట్టు సాధించేలా వచ్చే సోమవారం నుంచి అన్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో అమలయ్యే ఈ కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు ప్రాధాన్యతగా తీసుకోవాలని తెలిపారు. ముప్ఫై రోజుల పాటు ప్రతీరోజు విద్యార్థి గంట సేపు చదివి సామర్థ్యాలు పెంచుకునేలా బుక్‌లెట్ తయారు చేశామన్నారు. జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులు ఉన్నందున కాస్త దృష్టి సారిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. అనంతరం అదనపు కలెక్టర్ శ్రీజ మాట్లాడుతూ చింతకాని మండలంలోని కొన్ని పాఠశాలల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలుచేసిన ఈ కార్యక్రమంతో మంచి ఫలితాలు వచ్చాయని చెప్పారు. మిగతా చోట్ల ఉపాధ్యాయులు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. విద్యాశాఖ ప్లానింగ్ కోఆర్డినేటర్ సీ.హెచ్.రామకృష్ణ, సీఎంఓ ప్రవీణ్, ఎంఈఓలు, హెచ్‌ఎంలు పాల్గొన్నారు.