
మైలురాయిగా ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ
సాక్షిప్రతినిధి, ఖమ్మం: కొత్తగూడెంలోని మైనింగ్ కళాశాలను ఎర్త్ సైన్స్ యూనివర్సిటీగా మారుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశ విద్యాచరిత్రలో మైలురాయిగా నిలుస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్, విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణాతో మంత్రి హైదరాబాద్‌లోని సచివాలయంలో బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రవేశాలు, భవన నిర్మాణ ప్రతిపాదనలపై చర్చించాక మంత్రి మాట్లాడారు. కొత్తగూడెంలోని ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ దేశంలోనే మొదటిది కాగా, ప్రపంచంలో రెండోదని తెలిపారు. 300 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటవుతున్న ఈ విద్యాసంస్థకు మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్‌సింగ్ పేరు పెట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇక్కడ చదివే విద్యార్థులు భూశాస్త్రవేత్తలు, ఖనిజ నిపుణులుగా కీలక పాత్ర పోషిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా, నిర్మాణాలకు అవసరమైన నిధుల సమీకరణ కోసం ఎన్‌ఎండీసీ, సింగరేణి, కోల్ ఇండియా ప్రతినిధులతో చర్చించినట్లు మంత్రి తెలిపారు.
వీసీ యోగితారాణాతో భేటీలో
మంత్రి తుమ్మల