
కళాశాల భవనం పైనుంచి పడిన విద్యార్థి
రఘునాథపాలెం: మండలంలోని కేసీఆర్ కాలనీ ఎదురుగా ఉన్న కస్తూర్బా జూనియర్ కళాశాల విద్యార్థి భవనం రెండో అంతస్తు నుంచి పడగా తీవ్రగాయాలయ్యాయి. కూసుమంచి మండలం ధర్మతండాకు చెందిన జర్పుల సుమన్ కుమార్తె శ్రీ వల్లి కేజీబీవీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. శుక్రవారం తెల్లవారుజామున స్టడీ అవర్‌కు శ్రీవల్లి రాకపోవడంతో గదిలో పరిశీలించా క చుట్టుపక్కల గాలిస్తుండగా పోర్టికో పక్కన రక్తపు మడుగులో గుర్తించారు. దీంతో ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అనంతరం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కాగా, చికిత్స విషయమై ఉపాధ్యాయులు, సిబ్బంది నిర్లక్ష్యం వహించారని శ్రీవల్లి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో వదిలేసి వెళ్లిపోతే రోజువారి కూలీచేసే తాము చికిత్స కోసం రూ.లక్ష చెల్లించినా పరిస్థితి మెరుగుపడలేదని తెలిపారు. శ్రీవల్లి రెండో అంతస్తు నుంచి ఎలా పడిందో తెలియడం లేదని, పోలీసులు రాకముందే రక్తం మరకలు ఎందుకు తుడిచారని ప్రశ్నించారు. గురుకులం ప్రత్యేక అధికారి వై.లత మాత్రం రెండు రోజులుగా శ్రీవల్లి పీడకలలు వస్తున్నాయని చెప్పగా ఆమె తల్లితో ఫోన్‌లో మాట్లాడితే దీపావళికి తీసుకెళ్తామని చెప్పిందన్నారు. ఆస్పత్రికి స్కానింగ్ తీయించి ప్రమాదం లేదన్న చెప్పాకే తిరిగి వచ్చామని తెలిపారు. రఘునాథపాలెం సీఐ ఉస్మాన్‌షరీఫ్ పాఠశాలకు చేరుకుని వివరాలు ఆరా తీయగా.. ఆస్పత్రిలో మెజిస్టేట్ ద్వారా స్టేట్‌మెంట్ సైతం రికార్డు చేసినట్లు తెలిసింది. అయితే, శ్రీవల్లి భవనం పైనుంచి ఎలా పడిందో తెలియరాలేదు.
రఘునాథపాలెం కేజీబీవీలో ఘటన