సన్నగా.. దారి తప్పిస్తూ | - | Sakshi
Sakshi News home page

సన్నగా.. దారి తప్పిస్తూ

Oct 17 2025 5:54 AM | Updated on Oct 17 2025 5:54 AM

సన్నగ

సన్నగా.. దారి తప్పిస్తూ

651 క్వింటాళ్లు సీజ్‌..

ఐదు నెలల్లో 6 ‘ఏ’ కేసులు.. 29

ఇప్పటి వరకు వివిధ ప్రాంతాల్లో

651క్వింటాళ్ల బియ్యం సీజ్‌

సాక్షిప్రతినిధి, ఖమ్మం: ప్రభుత్వం ఎన్ని మార్పులు చేసినా, ఎంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా.. పలువురిపై కేసులు నమోదు చేసినా రేషన్‌ దందాకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. సన్నబియ్యం పంపిణీ చేస్తే లబ్ధిదారులంతా తీసుకుంటారని, తద్వారా బియ్యం పక్కదారి పట్టే అవకాశం లేదని ప్రభుత్వం భావించింది. కానీ దీన్ని కూడా అక్రమార్కులకు వరంలా మార్చుకుని కొందరు డీలర్లు, దళారులు కలిసి యథేచ్ఛగా బియ్యాన్ని దారి మళ్లిస్తున్నారు. ఇంకొన్ని చోట్ల లబ్ధిదారులే బియ్యం అమ్ముకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మే నుంచి సెప్టెంబర్‌ వరకు జిల్లాలో పలు చోట్ల అక్రమంగా తరలిస్తున్న సన్నబియ్యం స్వాధీనంచ చేసుకుని 29 ఘటనల్లో 6 ‘ఏ’ కేసులు నమోదు చేశారు.

దశాబ్దాలుగా ఇదే దందా..

రేషన్‌ బియ్యం రవాణా ఏళ్లుగా వ్యవస్థీకృత నేరంలా మారింది. పేదల కడుపు నింపేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంపిణీ చేస్తున్న బియ్యం కొందరికి కాసులు కురిపిస్తోంది. గతంలో రేషన్‌ దుకాణాల ద్వారా దొడ్డుబియ్యం పంపిణీ చేయగా చాలా మంది లబ్ధిదారులు తినలేక డీలర్లు, వ్యాపారులకు విక్రయించే వారు. దీంతో ఇదే వ్యాపారంగా పెట్టుకున్న కొందరు సేకరించాక ప్రాసెస్‌ చేయించి అధిక ధరలకు విక్రయించేవారు. బడా వ్యాపారులైతే మిల్లర్లు, డీలర్లు, ఇతరుల నుంచి భారీ మొత్తంలో రేషన్‌ బియ్యం సేకరించి పాలిష్‌ అనంతరం జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని ఓడ రేవులకు, ఆపై విదేశాలకు కూడా ఎగుమతి చేశారు. ఇలా పేదలకు పాలకులు అందించే రేషన్‌ బియ్యం అక్రమార్కులకు రూ.కోట్లు సంపాదించి పెట్టింది.

సన్న బియ్యంతోనూ..

పేద, మధ్య తరగతి ప్రజలు దొడ్డుబియ్యం తినలేక తీసుకోవడం లేదని.. పలువురు డీలర్లకే విక్రయిస్తున్నారని ప్రభుత్వం గుర్తించింది. తద్వారా దారి మళ్లుతోందని గుర్తించగా సన్నబియ్యం పంపిణీలో ఈ వ్యవహారానికి చెక్‌ పెట్టొచ్చని భావించింది. సన్నబియ్యమైతే అందరూ తింటారని, తద్వారా డీలర్ల వద్ద మిగలవని.. ఆపై అక్రమాలు జరగవని అంచనా వేసింది. మొదటి రెండు నెలలు ప్రభుత్వం అనుకున్నట్లుగా లబ్ధిదారులంతా బియ్యం తీసుకెళ్లగా ఎక్కడా దారి మళ్లిన ఆనవాళ్లు బయటపడలేదు. కానీ సన్నబియ్యంకు డిమాండ్‌ ఉండటం, ధర కూడా ఎక్కువగా వస్తుండడంతో లబ్ధిదారులు విక్రయించడం మొదలుపెట్టడంతో దళారులు మళ్లీ రంగంలోకి దిగి ఇతర ప్రాంతాలకు తరలించడం ఆరంభించారు.

ఎక్కడ వీలుంటే అక్కడ..

గతంలో దొడ్డు బియ్యం కేజీ రూ.10 లోపు విక్రయించగా.. సన్నబియ్యానికి వ్యాపారులు రూ.20 ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమాన కొందరు రేషన్‌షాపుల్లో డీలర్లకే విక్రయిస్తుండగా, ఇంకొందరు తీసుకున్నాక వ్యాపారులు అప్పగిస్తున్నట్లు సమాచారం. అయితే, దందాకు ఎంఎల్‌ఎస్‌ పాయింట్లు కూడా కీలకంగా మారాయనే చర్చ జరుగుతోంది. కొందరు డీలర్లు ఇక్కడి నుంచి తీసుకెళ్లినట్లు రికార్డుల్లో నమోదు చేస్తున్నా బయటకు తీసుకెళ్లడం లేదని సమాచారం. తద్వారా వ్యాపారులు కొందరు లబ్ధిదారులు, డీలర్ల నుంచే కాక ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి సేకరించి వాహనాల్లో భారీగా సన్నబియ్యం రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది.

సన్నబియ్యం తరలిస్తున్న ఘటనలు వెలుగు చూడడంతో అధికారులు నిఘా కట్టుదిట్టం చేశారు. దీంతో కొన్నిచోట్ల బియ్యం పట్టుపడుతున్నా అక్రమంగా తరలించే బియ్యం అంత కంటే భారీగానే ఉంటుందని చెబుతున్నారు. జిల్లాలో ఈ ఏడాది మే నెల నుంచి సెప్టెంబర్‌ వరకు టాస్క్‌ఫోర్స్‌ బృందాలు పలు మిల్లులు, రేషన్‌దుకాణాల్లో 28సార్లు తనిఖీ చేపట్టాయి. రేషన్‌ షాప్‌ల్లో బియ్యం నిల్వల్లో తేడా ఉన్నచోట నాలుగు కేసులు, బియ్యం అక్రమంగా తరలిస్తున్న వారిపై 25 కేసులు నమోదు చేశారు. ఆయా కేసుల్లో 651.60 క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్‌ చేశారు. కాగా, ఈనెల 14న నేలకొండపల్లిలోని ఓ రైస్‌ మిల్లులో 600 క్వింటాళ్ల బియ్యాన్ని అనుమానంతో పౌర సరఫరాల సంస్థ అధికారులు సీజ్‌ చేశారు. అయితే, ఈ బియ్యం శాంపిళ్లను ల్యాబ్‌కు పంపించగా పీడీఎస్‌ బియ్యం కాదని తేలింది.

బ్లాక్‌ మార్కెట్‌కు తరలుతున్న రేషన్‌బియ్యం

సన్నగా.. దారి తప్పిస్తూ1
1/1

సన్నగా.. దారి తప్పిస్తూ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement