
నేడు జిల్లాకు డిప్యూటీ సీఎం
ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం ఖమ్మంలో రానున్నారు. ఉదయం 10–30 గంటలకు ఖమ్మం చేరుకోనున్న భట్టి తొలుత అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు. ఆతర్వాత 11నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ శాఖపై అధికారులతో సమీక్షించనున్నారు.
నేడు, రేపు మంత్రి తుమ్మల పర్యటన
ఖమ్మంఅర్బన్: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్ర, శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. శుక్రవారం ఉదయం ఖమ్మం 22వ డివిజన్ ముస్తఫానగర్‌లో బీసీ హాస్టల్ భవనానికి శంకుస్థాపన చేస్తారు. ఆతర్వాత సాయంత్రం 5గంటలకు భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట మండలం నారంవారిగూడెంలో ఆయిల్ పామ్ మొలకలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే, శనివారం ఉదయం రఘునాథపాలెం తహసీల్ సమీపాన చిల్డ్రన్స్ హోమ్ భవన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేస్తారు.
కలెక్టర్‌ను కలిసిన ఎంపీ
ఖమ్మంమయూరిసెంటర్: జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి గురువారం కలెక్టరేట్‌లో కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులపై ప్రతిపాదనలు అందజేశారు. అలాగే, ఎంపీ నిధులతో చేపడుతున్న పనుల పురోగతి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై ఎంపీ సమీక్షించారు.
ఖమ్మం రూరల్: రూరల్ మండలంలోని మారె మ్మ దేవస్థానం వద్ద జరిగిన పలు కార్యక్రమాలకు ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి హాజరయ్యారు. నాయకులు కొప్పుల చంద్రశేఖర్, ఉమ్మినేని కృష్ణ, ఇమామ్ భాయ్, మొగిలిచర్ల సైదులు, విప్లవ్ కుమార్ పాల్గొన్నారు.
దర్యాప్తులో ఆధారాల
సేకరణే కీలకం
ఖమ్మంక్రైం: నేరదర్యాప్తులో ఆధారాలు సేకరించడాన్ని కీలకంగా భావించాలని పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ సూచించారు. కమిషనరేట్ ఆవరణలో ఆధునికీకరించిన ఫింగర్ ఫ్రింట్ యూనిట్ కార్యాలయాన్ని గురువారం సీపీ పరిశీలించి మాట్లాడారు. ఫింగర్‌ప్రింట్ యూనిట్లలో ఆధునిక యంత్రాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. పోలీసులు ఘటనాస్థలిలో సేకరించిన వేలిముద్రలను శాసీ్త్రయ విశ్లేషణ ద్వారా పాత నేరస్తులు, అనుమానితుల వేలిముద్రలతో పోల్చిచూస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ ప్రసాద్‌రావు, ఏఆర్ ఏసీపీ సుశీల్‌సింగ్, సీఐలు, ఆర్‌ఐలు నరేష్, కామరాజు, సురేష్, బాలాజీ పాల్గొన్నారు.
ఖమ్మం మార్కెట్‌కు సెలవులు
ఖమ్మంవ్యవసాయం: వారాంతపు సెలవులు, దీపావళి పండుగ సందర్భంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు వరుసగా నాలుగు రోజుల సెలవులు ప్రకటించారు. ఈనెల 18 శనివారం, 19న ఆదివారం వారాంతపు సెలవులు కాగా, 20న సోమవారం నరక చతుర్దశి, 21వ తేదీ మంగళవారం దీపావళి సెలవు ప్రకటించినట్లు మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి పి.ప్రవీణ్‌కుమార్ తెలిపారు. తిరిగి 22వ తేదీ బుధవారం నుంచి మార్కెట్ కార్యకలాపాలు యదావిధిగా కొనసాగుతాయని ఆయన వెల్లడించారు.
విద్యార్థులకు
వ్యాసరచన పోటీలు
ఖమ్మంక్రైం: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం(పోలీసు ఫ్లాగ్ డే)ను పురస్కరించుకుని విద్యార్థులకు ఆన్‌లైన్‌లో వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్లు పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ తెలిపారు. తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో జరిగే పోటీల్లో 6వ తరగతి నుండి పీజీ వరకు విద్యార్థులు పాల్గొనవచ్చని పేర్కొన్నారు. విద్యార్థులు తమ వ్యాసాలను ఈనెల 28వ తేదీలోగా సమర్పిస్తే, జిల్లాలో ప్రతిభ కనబర్చిన ముగ్గురికి బహుమతులు అందించడంతో పాటు రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తామని తెలిపారు. వివరాల కోసం 87126 59256 నంబర్‌లో సంప్రదించాలని సీపీ సూచించారు.

నేడు జిల్లాకు డిప్యూటీ సీఎం