
మెరుగైన సేవలతో నమ్మకం
స్లాట్ బుకింగ్ విధానంలో
పత్తి కొనుగోళ్లు
● వైద్యపరీక్షలకు బయటకు పంపితే చర్యలు ● ఆస్పత్రుల పనితీరుపై కలెక్టర్ అనుదీప్ సమీక్ష
ఖమ్మంవైద్యవిభాగం: ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సేవలు అందించడం ద్వారా ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం పెంచాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. జిల్లాలోని తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల పనితీరుపై గురువారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆస్పత్రుల్లో మెరుగైన సేవలందితే జిల్లా ఆస్పత్రిపై భారం తగ్గుతుందన్నారు. తిరుమలాయపాలెం, నేలకొండపల్లి ఆస్పత్రుల్లో మంచి ఫలితాలు రాగా, కల్లూరు, వైరా, సత్తుపల్లి , పెనుబల్లి, మధిర ఆస్పత్రులలో ఆశించిన పురోగతి లేదని తెలిపారు. సరిపడా వైద్యులు, సిబ్బంది ఉన్నా అతి తక్కువ ప్రసవాలు జరగడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వీవీపీ ఆస్పత్రులో నెలకు కనీసం 200 ప్రసవాలు జరిగేలా వైద్యులు కృషి చేయాలని సూచించారు. అలాగే, డయాగ్నోస్టిక్ హబ్‌కు శాంపిళ్లు పంపాలే తప్ప ప్రైవేట్ ల్యాబ్‌లకు పంపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదే సమయాన ఆస్పత్రులకు కావాల్సిన యంత్రాలపై ప్రతిపాదనలు సమర్పించాలని, మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సలు జరిగేలా కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ తెలిపారు. డీసీహెచ్‌ఎస్ డాక్టర్ రాజశేఖర్‌గౌడ్, పాలేరు నియోజకవర్గ ప్రత్యేకాధిధికారి రమేష్, సూపరింటెండెంట్లు, వైద్యులు పాల్గొన్నారు.
ఓటరు దరఖాస్తులు పరిష్కరించండి
ఖమ్మం సహకారనగర్: ఓటరు నమోదు కోసం వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్‌రెడ్డి సూచించారు. హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్షించగా, కలెక్టరేట్ కలెక్టర్ అనుదీప్, అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, కేఎంసీ కమీషనర్ అభిషేక్ అగస్త్య, ఆర్డీఓ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న ఓటరు దరఖాస్తులను సత్వరమే పరిష్కరించడమే కాక ప్రతీ పోలింగ్ బూత్‌కు ఉద్యోగిని నియమించాలని, నూతన ఓటర్లకు గుర్తింపు కార్డులు పంపిణీ చేయాలని తెలిపారు.
ఖమ్మంవ్యవసాయం: దళారుల సమస్యకు చెక్ పెట్టేలా రైతులే నేరుగా స్లాట్ బుక్ చేసుకుని సీసీఐ కేంద్రాల్లో పత్తి విక్రయించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. కేంద్రప్రభుత్వం రూపొందించిన కపాస్ కిసాన్ యాప్ ద్వారా ఆధార్ లింక్ అయిన మొబైల్ నంబర్ నుంచి స్లాట్ బుక్ చేసుకునేలా అధికారులు అవగాహన కల్పిస్తారని వెల్లడించారు. స్లాట్ బుక్ చేసుకున్న రోజు వెళ్లలేకపోతే 24 గంటల ముందు రద్దు చేసుకోవాలని, ఒక రైతు మూడుసార్లే రద్దు చేసుకునే అవకాశం ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు.