
ధాన్యం కొనుగోళ్లకు సిద్ధం
శాఖల వారీగా ఏర్పాటుచేసే కేంద్రాలు, సేకరించే ధాన్యం
కల్లూరు మండలంలో
తెరుచుకున్న రెండు కేంద్రాలు
వరి కోతలు మొదలైన చోట్ల
తొలుత ఏర్పాటు
దశల వారీగా 326కేంద్రాల ప్రారంభానికి సన్నాహాలు
సాక్షిప్రతినిధి,ఖమ్మం: వానాకాలం వరి కోతలు జిల్లాలోని పలు చోట్ల మొదలయ్యాయి. నాగార్జునసాగర్ ఆయకట్టు ప్రాంతంలో బోర్లు, బావుల కింద సాగు చేసిన వరి ముందుగా కోతకు వస్తోంది. ఈనేపథ్యాన ఎక్కడ కోతలు మొదలైతే అక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేలా పౌర సరఫరాల సంస్థ అధికారులు సిద్ధమయ్యారు. వచ్చేనెల మొదటి వారం నాటికి జిల్లాలో మొత్తం 326 కేంద్రాలు ఏర్పాటుచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇందులో భాగంగా కల్లూరు మండలంలోని ఎర్రబోయినపల్లి, పుల్లయ్యబంజరలో రెండు కేంద్రాలను గురువారం ప్రారంభించారు.
3.69 లక్షల మె. టన్నుల ధాన్యం సేకరణ
జిల్లాలో ఈ వానాకాలం సాగైన వరికి సంబంధించి 3,69,609 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని పౌర సరఫరాల సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యంలో 18,480 మెట్రిక్ టన్నులు దొడ్డు ధాన్యం, 3,51,129 మెట్రిక్ టన్నులు సన్న ధాన్యం ఉన్నాయి. ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం సరఫరా చేస్తుండడంతో సన్నధాన్యం సేకరణకే ప్రాధాన్యత ఇస్తున్నారు. జిల్లాలో 1,18,040 హెక్టార్లలో వరి సాగు కాగా 7,23,988 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఇందులో 51,971 మెట్రిక్ టన్నులు రైతుల అవసరాలు, విత్తనాల కోసం వినియోగిస్తారు. అలాగే, వ్యాపారులు, మిల్లర్లు 3,02,408 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తారనే భావనకు వచ్చారు. ఇక మిగిలిన మిగిలిన 3,69,609 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పౌర సరఫరాల సంస్థ కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించనుంది.
దీపావళి తర్వాతే కోతలు
దీపావళి పండుగ అనంతరం.. అమావాస్య దాటాక జిల్లాలో వరి కోతలు ముమ్మరమయ్యే అవకాశముంది. సాగర్ ఆయకట్టుకు నీరు విడుదల చేయడంతో ఈ ఖరీఫ్‌లో ఎక్కువగా వరి సాగైంది. భారీ వర్షాలు పడడంతో సాగర్ నీటిని ఎలాగైనా విడుదల చేస్తారనే అంచనాతో ఆయకట్టులోని బోర్లు, బావుల కింద వేల ఎకరాల్లో ముందస్తుగా వరి సాగు చేశారు. నేలకొండపల్లి, కూసుమంచి, సత్తుపల్లి, కల్లూరు, ముదిగొండ, వైరాలో వరి ముందుగానే కోతకు వస్తోంది. ఈ ప్రాంతాల్లో కేంద్రాలను తొలుత తెరుస్తారు. ఆపై మిగతా చోట్ల వచ్చేనెల మొదటి వారం నాటికి కేంద్రాలు తెరవాలనే నిర్ణయానికి వచ్చారు. కాగా, జిల్లాలో 326 కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ చేపడుతామని, ఇందులో 51 కేంద్రాల ద్వారా దొడ్డు రకం, 275 కేంద్రాల ద్వారా సన్న రకం ధాన్యం సేకరిస్తామని పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శ్రీలత ‘సాక్షి’కి తెలిపారు.
శాఖ దొడ్డు రకం సన్న రకం మొత్తం
డీసీఎంఎస్ – 28 28
డీఆర్‌డీఏ 49 89 138
పీఏసీఎస్ 2 155 157
మెప్మా – 03 03
మొత్తం 51 275 326