
టీటీడీ ఆలయ నిర్మాణంతో ఆధ్యాత్మిక శోభ
● స్థల అప్పగింతపై కార్యాచరణ ● అధికారులతో సమీక్షలో కలెక్టర్ అనుదీప్
ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మం అర్బన్ మండలం అల్లీపురం సమీపాన తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యాన వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకోవడమేకాక పర్యాటకం, ఉపాధి పరంగా అభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. కలెక్టరేట్‌లో గురువారం ఆయన దేవాదాయ శాఖ స్థపతి ఎన్.వల్లీనాయగం, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆలయ నిర్హాణానికి అల్లీపురం వద్ద గుర్తించిన 20 ఎకరాల స్థలం అప్పగింతపై దృష్టి సారించాలని సూచించారు. ఆలయ నిర్మాణమే కాక విడిది గృహాలు, వేద పాఠశాల, కల్యాణ మండపం, కళాక్షేత్రం, భజన మండపం, హెలీప్యాడ్ నిర్మాణానిక ప్రణాళిక రూపొందించాలని తెలిపారు.
స్థల పరిశీలన
ఖమ్మం అర్బన్: టీటీడీ ఆధ్వర్యాన నిర్మించే ఆలయ కోసం అల్లీపురం–కొత్తగూడెం మధ్య గుర్తించిన స్థలా న్ని దేవాదాయ శాఖ స్థపతి వల్లీనాయగం, అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఆర్‌డీఓ నర్సింహారావు పరిశీ లించారు. అక్కడ స్థలం వివరాలు ఆరా తీయడంతో పాటు నిర్మాణానికి ఉన్న అనుకూలతలపై చర్చించారు. ఈ కార్యక్రమాల్లో దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ ఎం.వీరస్వామి, డీఈ రమేష్‌బాబు, తహసీల్దార్ సైదులు తదితరులు పాల్గొన్నారు.