
పీడీఎస్‌యూ మహాసభల ఆహ్వాన కమిటీ ఎన్నిక
ఖమ్మంమయూరిసెంటర్: మతం పేరుతో ప్రజల విభజనకు జరుగుతున్న కుట్రలను యువత, విద్యార్థులు అడ్డుకోవాలని టీపీటీఎఫ్ మాజీ రాష్ట్ర కార్యదర్శి మనోహర్‌రాజు సూచించారు. డిసెంబర్‌లో పీడీఎస్‌యూ రాష్ట్ర మహాసభలు జరగనుండగా ఖమ్మంలో గురువారం రాష్ట్ర అధ్యక్షుడు కంపాటి పృధ్వీ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పోస్టర్లు ఆవిష్కరించి ఆహ్వాన సంఘం కమిటీని ఎన్నుకున్నారు. ఈసందర్భంగా మనోహర్‌రాజు మాట్లాడుతూ నూతన విద్యావిధానం పేరుతో విద్యావ్యవస్థల్లో మత రాజకీయాలను జొప్పించేలా కేంద్రం యత్నిస్తోందని విమర్శించారు. ఇక ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సైతం విద్యారంగ సమస్యలను పరిష్కరించడం లేదని చెప్పారు. అనంతరం ఆహ్వాన సంఘం గౌరవ అధ్య క్షుడిగా వైవీ.రమణరావు, అధ్యక్షుడిగా వి.మనోహర్ రాజు, ప్రధాన కార్యదర్శిగా కాంపాటి పృధ్వీ, రాష్ట్ర కోశాధికారిగా ఆవుల అశోక్ తదితరులను ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో ిపీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.అనిల్‌తోపాటు పోటు రంగారావు, వడ్డెల్లి కృష్ణమూర్తి, ఐవీ.రమణ, తదితరులు పాల్గొన్నారు.