
పెరిగి.. తగ్గుతున్న మిర్చి ధర
ఇతర రాష్ట్రాల్లోనూ తేజ రకం సాగు
మరోపక్క విదేశాలకు తగ్గిన
ఎగుమతులు
ఫలితంగా కోల్డ్ స్టోరేజీలు దాటని
నిల్వలు
మధిర: మార్కెట్‌లో ప్రస్తుతం మిర్చి ధర నిలకడగా ఉంది. ఓ వారం క్వింటాకు రూ 500 పెరుగుతుండగా మరో వారం తగ్గుతోంది. రెండేళ్లుగా కోల్డ్ స్టోరేజీలో నిల్వ చేసిన మిర్చిని రైతులు ఇప్పుడు తప్పనిసరై విక్రయిస్తున్నారు. మరో రెండు నెలలు గడిస్తే ఈ ఏడాది సాగు చేసిన మిర్చి చేతికి రానుండడంతో చేసేదేం లేక.. ధర రాకున్నా అమ్ముతున్నారు. దీనికి తోడు ఈ ఏడాది పంటల పెట్టుబడికి డబ్బు అవసరం కావడంతో తక్కువ ధరకై నా అమ్మాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు.
ఎగుమతులు లేక..
తెలుగు రాష్ట్రాల్లో పండిన తేజ రకం మిర్చి చైనా, బంగ్లాదేశ్, మలేషియా తదితర దేశాలకు ఎగుమతి అవుతుంది. ఇక్కడ పండే పంట ఎక్కువగా చైనాకు ఎగుమతి చేస్తారు. కానీ ఈసారి ఎగుమతుల ఆర్డర్లు లేవంటూ వ్యాపారులు కొనడానికి ముందుకు రావడం లేదు. దీంతో గత ఏడాది సాగు చేసిన మిర్చి ధర పెరుగుతుందనే ఆశతో నిల్వ చేసిన రైతులకు నిరాశే ఎదురవుతోంది. దీంతో ప్రస్తుత జిల్లా మార్కెట్లలో క్వింటా మిర్చికి రూ.11వేల నుంచి రూ.14,500 ధర పలుకుతోంది. జెండా పాట రూ.14వేలుగా నమోదవుతున్నా ఆ ధరతో కొనుగోళ్లు జరగడం లేదని చెబుతున్నారు. మధిర, ఖమ్మం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు తదితర మార్కెట్లలోనూ తేజ రకం క్వింటా రూ.15 వేల ధరే ఉంది.
అయినా కొనడం లేదు...
ధర తక్కువగానే ఉన్నా ఎగుమతిదారులు కొనడం లేదు. గతంలో కొని చైనాలో నిల్వ చేసిన మిర్చిని ఇప్పుడు వినియోగిస్తుండడమే ఎగుమతులు లేకపోవడానికి కారణంగా చెబుతున్నారు. దీనికి తోడు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్ తదితర రాష్ట్రాల్లోనూ మిర్చి సాగు పెరగడం.. అక్కడ తేజ రకాన్ని పోలిన మిర్చి సాగవుతుండడంతో తక్కువ ధరకే కొంటున్నట్లు సమాచారం. జిల్లాలో 42 కోల్డ్ స్టోరేజీలు ఉండగా సుమారు 30లక్షల బస్తాల మిర్చి నిల్వలు ఉన్నాయి. అయితే, జిల్లాలో నిల్వ ఉన్న మిర్చి అమ్ముడయ్యే వరకు ధర పెరిగే పరిస్థితి లేదని వ్యాపారులు విశ్లేషిస్తున్నారు. కాగా, వివిధ కారణాలతో మిర్చి దిగుబడి, ధర తగ్గడంతో ఈసారి జిల్లాలో మిర్చి సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయంది. గత ఏడాది జిల్లాలో 59వేల ఎకరాల్లో సాగైతే ఈ ఏడాది 25వేల ఎకరాల్లోనే సాగవడం గమనార్హం.